ఓవర్ లోడ్ దించుకుంటున్నారా ?
తెలంగాణాలో బీఆర్ఎస్ అనే పడవలో లోడ్ ఎక్కువైపోయింది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మరే పార్టీ కూడా బతికి బట్టకూడదన్న ఉద్దేశ్యంతో అన్ని పార్టీలను కేసీయార్ ఒకపుడు చీల్చి చెండాడేశారు
తెలంగాణాలో బీఆర్ఎస్ అనే పడవలో లోడ్ ఎక్కువైపోయింది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మరే పార్టీ కూడా బతికి బట్టకూడదన్న ఉద్దేశ్యంతో అన్ని పార్టీలను కేసీయార్ ఒకపుడు చీల్చి చెండాడేశారు. తెలుగుదేశంపార్టీతో మొదలుపెట్టిన ప్రలోభాలు, ఒత్తిళ్ళు కాంగ్రెస్ పార్టీ మీదుగా బీజేపీ దగ్గరకు వెళ్ళి ఆగింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలను తర్వాత కాంగ్రెస్ ఎంఎల్ఏలను, నేతలను లాగేసుకున్నారు. దీంతో ఏమైందంటే ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన నేతల కారణంగా టీఆర్ఎస్ అనే షిప్పు ఓవర్ లోడ్ అయిపోయింది.
తర్వాత టీఆర్ఎస్ అనే ప్రాంతీయపార్టీ జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మారింది. దాంతో కొంత లోడ్ ను ఇతర రాష్ట్రాల్లో ఇన్చార్జిలుగా నియమించటంతో భారం తగ్గించుకున్నారు. అయినా సరే లోడ్ ఎక్కువగానే అనిపిస్తోంది. అందుకనే అవసరంలేదు అని అనుకుంటున్న నేతలు పార్టీ మారుతున్నా కేసీయార్ పట్టించుకోవటంలేదని పార్టీలో టాక్. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులకు సమాంతరంగా కొందరు నేతలు బలంగా పెరిగిపోయారు. సదరు నేతలు పార్టీ మారితే గెలుపుపై ప్రభావం చూపుతుందని అనుకున్నప్పుడు మాత్రమే కేసీయార్ బుజ్జగింపులకు ఆదేశమిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి పార్టీ వదిలేస్తారనే ప్రచారం కారణంగానే పిలిపించి మాట్లాడారు. వెంటనే మంత్రిని చేసేశారు. ఎందుకంటే పట్నం గనుక పార్టీకి ఎదురుతిరిగితే చాలా నష్టం వస్తుందని కేసీయార్ సర్వేల్లో తేలిందట. పటాన్ చెరువు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్సీ భూపాల్ రెడ్డిని స్టేట్ ఫైనాన్స్ కమీషన్ కమీషన్ ఛైర్మన్ గా నియమించారు. ఎందుకంటే భూపాల్ గెలుపోటములను ప్రభావితం చేయగలరని తేలిందట.
ఇదే సమయంలో ఖానాపూర్ ఎంఎల్ఏ రేఖానాయక్ కు టికెట్ ఇవ్వదలచుకోలేదు. అందుకనే ఆమె ఎంత గోలచేస్తున్నా కనీసం పట్టించుకోవటంలేదు. ఉప్పల్ ఎంఎల్ఏ బేతి సుభాష్ రెడ్డి పార్టీ మారినా పట్టించుకోలేదు. మైనంపల్లి హనుమంతరావును పార్టీలో ఉంచుకోవటానికి చాలా ప్రయత్నాలు చేసి సాధ్యంకాక వదిలేశారు. పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తోందనే భావనను కేసీయార్ అందరిలోను కల్పిస్తున్నారు. దాంతో కొందరు నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొత్తంమీద అనవసరం అనుకున్న నేతలను వదిలించుకోవటం వల్ల ఓవర్ లోడ్ దింపుకుంటున్నది మాత్రం వాస్తవమే.