తండ్రేమో పదేళ్లు అంటే.. కొడుకేమో వేరేటోళ్ల అక్కరేముందట!
అధికారం చేతిలో ఉన్నప్పుడు.. దాన్ని వదులుకోవాలన్న ఆలోచన కలలో కూడా ఉండదన్నది తెలిసిందే
అధికారం చేతిలో ఉన్నప్పుడు.. దాన్ని వదులుకోవాలన్న ఆలోచన కలలో కూడా ఉండదన్నది తెలిసిందే. అయితే.. అధికారం ఎవరికి శాశ్వితం కాదన్న సోయి ఉన్నప్పటికీ.. వదులుకోవాలన్న విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ నోటి నుంచి వస్తున్న మాటలకు మధ్య తేడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని తపిస్తున్న గులాబీ అధినేత.. అందుకు తగ్గట్లే తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రజలు తమకే అధికారాన్ని ఎందుకు ఇవ్వాలన్న విషయంపై ఆయన ఆచితూచి అన్నట్లు మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన చేస్తున్న ప్రసంగాల్ని చూస్తే.. ''రైతుల బతుకులు బాగుపడాలని నేను డిజైన్ చేసిందే రైతుబంధు పథకం. ప్రపంచంలోనే ఎక్కడా లేదు. నేను కూడా రైతునే. ఆ గోస నాకు తెలుసు. ఇంకో పదేళ్లు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప కర్షకునిగా మారే పరిస్థితి వస్తుంది'' అని చెప్పటం ద్వారా తమ చేతిలో అధికారం మరో పదేళ్లు ఎందుకు ఉండాలన్న దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో మంత్రి కేటీఆర్ మాటలు కాస్త భిన్నంగా ఉంటున్నాయి. అధికారం ఎవరికో ఎందుకు ఇవ్వాలి? తమ చేతిలోనే ఉండిపోవాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం ఆసక్తికరంగా మారింది. 'ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను ఆగం చేయొద్దు. కాంగ్రెస్.. బీజేపీల మాయ మాటలు నమ్మొద్దు. ఒకవేళ వాళ్లకు అధికారమిస్తే రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళుతుంది. అయినా బీఆర్ఎస్ పాలనలో మనకేం తక్కువైంది. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన అక్కరేముంది?'' అని వ్యాఖ్యానించటం గమనార్హం.
అధికారం తమ సొంతం కావాలనుకోవటం బాగానే ఉన్నా.. ఎప్పటికి తమకే ఉండాలన్న మాట.. అహంభావంగా ప్రజల్లోకి వెళుతుందన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు. ఇటీవల కాలంలో కేటీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏదో రకంగా తేడా కొడుతుందన్న మాట వినిపిస్తున్న వేళలోనే.. తాజా వ్యాఖ్య రావటం చర్చనీయాంశంగా మారింది. ఒకే రోజు.. తండ్రీకొడుకుల నోటి వచ్చిన 'పవర్' మాట తేడా అందరిని ఆకర్షిస్తోంది.