వీళ్ళకి రుణమాఫీ ఎప్పుడు ?
రైతు రుణమాఫీ అన్నది కేసీఆర్ ప్రభుత్వానికి కొంచెం తలనొప్పిగా తయారయ్యేట్లుంది
రైతు రుణమాఫీ అన్నది కేసీఆర్ ప్రభుత్వానికి కొంచెం తలనొప్పిగా తయారయ్యేట్లుంది. లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులు 16.66 లక్షల మందికి రుణాలు మాఫీ అయ్యాయి. తాజా మాఫీ కోసం ప్రభుత్వం బ్యాంకులకు రు. 5,809 కోట్లు విడుదల చేసింది. గతంలోనే రు. 1207 కోట్లు రుణమాఫీ చేసింది. అంటే సుమారు రూ. 7 వేల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లయ్యింది. అయితే ఇప్పటివరకు రుణాలు మాఫీ అయ్యింది రు. 99,999 లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే.
లక్ష రూపాయలు, ఆ పైగా రుణాలున్న రైతుల మాటేమిటి ? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే లక్ష రూపాయలకు పైగా రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య ప్రభుత్వం లెక్కల ప్రకారమే 20 లక్షలు. అందుబాటులోని సమాచారం ప్రకారం వీళ్ళ రుణాలను మాఫీ చేయాలంటే కనీసం రూ. 12 వేల కోట్లు అవసరం. మొత్తం రైతు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ సెప్టెంబర్ మొదటి వారం. ఇపుడు చేసిన రుణమాఫీకి ప్రభుత్వం ఆదాయార్జన శాఖల నెత్తిన కూర్చుని ఆదాయాలను పిండి వసూలు చేసింది.
అనుకున్నట్లుగా ఆదాయం రాదనే అనుమానం రావటంతోనే ఎక్సైజ్ శాఖ ముందస్తు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు అమ్మేసి, లీజులకు ఇస్తే అంచనా వసూళ్లు సుమారు రు. 16 వేల కోట్లు. ఈ మొత్తంలో మెజారిటి భాగం ఇప్పుడు చేసిన రుణాల మాఫీకి సరిపోతుంది. మరి ఇంకా చేయాల్సిన రు. 12 వేల కోట్ల మాటేమిటి ?
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేలోగా ఈ 20 లక్షలమంది రైతులకు కూడా రుణాలను మాఫీ చేస్తే రేపటి ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులుండవు. లేకపోతే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులకు అంతే సంగతులు. ఇప్పుడు మాఫీ అవుతున్న రుణాలు ఎప్పుడో అయిపోవాల్సినవి. ఇంత హడావుడిగా రుణాలు మాఫీ చేస్తున్నారంటే ఎన్నికల్లో ఓటమి భయంతోనే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది 20 లక్షల మంది రైతుల బకాయిలు ప్రభుత్వం చేయలేకపోయినా లేకపోతే పెండింగులో పెట్టినా అప్పుడుంటుంది ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు.