గవర్నర్ ప్రసంగంపై ఎందుకీ గోల ?

తాజాగా తెలంగాణా అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై బీఆర్ఎస్ ఎంఎల్ఏలు నానా గోల చేస్తున్నారు.

Update: 2023-12-16 04:08 GMT

తాజాగా తెలంగాణా అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై బీఆర్ఎస్ ఎంఎల్ఏలు నానా గోల చేస్తున్నారు. గవర్నర్ తన స్ధాయికి తగ్గట్లుగా మాట్లాడలేదని సీనియర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి నానా రచ్చచేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గవర్నర్ ప్రసంగంలో నియంతృత్వం పోయి తెలంగాణాలో ప్రజాపాలన వచ్చిందని చెప్పారట. పాలకులకు ప్రజలకు మధ్య అడ్డుగా ఉన్న ఇనుపకంచెలు తొలగిపోయినట్లు చెప్పారు. వందరోజుల్లోనే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సిక్స్ గ్యారెంటీస్ అమలు ఖాయమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేయించబోతున్నట్లు ప్రకటించారట. విద్యుత్ శాఖ అప్పులు రు. 85 వేల కోట్లన్న విషయాన్ని ప్రకటించటం పట్ల బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడే బీఆర్ఎస్ పార్టీలో ఉలిక్కిపాటు బయటపడుతోంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు లేదు. దానికి కారణం ఏమిటంటే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని గవర్నర్ తనంతట తానుగా సొంతంగా తయారుచేసుకునేది కాదు.

రాష్ట్రప్రభుత్వం ఏ స్పీచును తయారుచేసి ఇస్తే గవర్నర్ దాన్ని మాత్రమే చదువుతారన్న విషయం అందరికీ తెలిసిందే. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కేసీయార్ ప్రభుత్వం ఏమి రాసిస్తే గవర్నర్లు దాన్నే చదివిన విషయం కడియం లాంటి సీనియర్లకు తెలీదా ? ఇపుడు ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి స్పీచును రాసిస్తే దాన్నే గవర్నర్ తమిళిసై చదివారంతే. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఆగ్రహం వ్యక్తంచేస్తే ప్రభుత్వం మీద చేయాలి కానీ గవర్నర్ మీద చూపించటంలో అర్ధంలేదు.

పైగా విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో ఉన్న విషయం వాస్తవమే కానీ అబద్ధాలు కాదు. కాకపోతే ఈ నిజాన్ని కేసీయార్ ప్రభుత్వమే దాచిపెట్టింది. వందరోజుల్లోనే సిక్స్ గ్యారెంటీస్ అమలన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీనే గవర్నర్ వినిపించారు. ఇందులో బీఆర్ఎస్ ఉలిక్కిపడేందుకు ఏముంది ? కాళేశ్వరం అవినీతిపైన దర్యాప్తు చేయించబోతున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. దాన్నే గవర్నర్ చదివారంతే. ఇందులో గవర్నర్ అబద్ధాలు చెప్పిందేముందో అర్ధంకావటంలేదు.

Tags:    

Similar News