గట్టిగా ఖండిస్తే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్లే(నా)?

ఏపీలో ఇంకా ఇప్పుడే మొదలుకాలేదు కానీ.. తెలంగాణలో మాత్రం రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి.

Update: 2024-06-23 12:30 GMT

ఏపీలో ఇంకా ఇప్పుడే మొదలుకాలేదు కానీ.. తెలంగాణలో మాత్రం రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఓవైపు వ్యక్తిగత ఇబ్బందులు.. మరోవైపు పార్టీ నుంచి జంపింగ్ లతో సతమతం అవుతున్నారు. గౌరవనీయ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు సాధించినా కేసీఆర్ కు అనుకోని రీతిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. కూతురు కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలు పాలవడం.. లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి ఖాతా తెరవలేకపోవడంతో బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

1 నుంచి 8?

రెండు రోజుల కిందట బీఆర్ఎస్ నుంచి ఎవరూ ఊహించని నాయకుడు కాంగ్రెస్ లో చేరారు. ఆయనే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ ఎంతగానో కొనియాడే పోచారం ఉమ్మడి ఏపీలోనే కాక తెలంగాణలోనూ మంత్రిగా పనిచేశారు. అలాంటాయన బీఆర్ఎస్ ను వీడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు చెందిన మరో పదిమంది వరకు ఎమ్మెల్యేలు హస్తం బాట పట్టేలా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. కాగా, వీరిలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, గంగుల కూడా ఉన్నారు.

వెళ్లబోమంటే.. వెళ్తున్నట్లే.

గంగుల మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచారు. ఎర్రబెల్లి మాత్రం పాలకొండలో ఓడిపోయారు. తాజాగా వీరిద్దరూ పార్టీ మారుతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ ఊహాగానాలని కొట్టివేశారు. అయితే, బీఆర్ఎస్ నుంచి వెళ్లకముందు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇలాగే చెప్పారు. దానం అయితే.. కేసీఆర్ గాయపడినప్పుడు హైదరాబాద్ లో ఉండేందుకు తన కొత్త ఇంటిని ఇస్తానని కూడా అన్నారు. అంతలోనే కారు దిగి హస్తం పంచన చేరారు. అంతేగాక, సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీచేశారు. ఇక కడియం సైతం బీఆర్ఎస్ ఓడిపోయిన తొలి రోజుల్లో ఆ పార్టీ వాయిస్ గా కనిపించారు. కేసీఆర్ విధానాలను గట్టిగా సమర్థించారు. ఆ వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. తన కుమార్తెకు బీఆర్ఎస్ ఇచ్చిన వరంగల్ ఎంపీ టికెట్ నూ వద్దన్నారు. ఆపై ఆమెకు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని గెలిపించుకున్నారు.

వీరిద్దరి ఉదాహరణలతో పాటు పార్టీ మారిన మరికొందరు నాయకుల స్టేట్ మెంట్లను పరిశీలిస్తే.. పార్టీ మార్పును ఖండిస్తే కాంగ్రెస్ లో చేరినట్లేనని స్పష్టమవుతోంది.

Tags:    

Similar News