మళ్లీ జంపింగ్ లు షురూ.. ఈసారి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరతారని చెబుతున్నవారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జీహెచ్ ఎంసీ కి చెందిన ఎమ్మెల్యే పేరు వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో దాదాపు రెండు నెలలుగా ఆగిపోయిన ఎమ్మెల్యేల జంపింగ్ లు మళ్లీ మొదలుకానున్నాయా? గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి చేరిక తర్వాత జరిగిన పరిణామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తపడుతోందా..? ఈసారి పక్కా పథకంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించనుందా..? దీనికి ఔననే సమాధానం వస్తోంది. ఈసారి కారు పార్టీ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రివర్స్ షాక్ గట్టిగానే..
తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వీరిలో గద్వాల ఎమ్మెల్యే కాస్త వెనక్కు తగ్గినట్లుగా కనిపించినా మళ్లీ అధికార పార్టీ వైపే ఉన్నారని చెబుతున్నారు. ఆయన నోరు విప్పితే గాని.. ఎటువైపు ఉన్నదీ తేలదు. ఇక ఆయన నియోజకవర్గం పక్కనే ఉండే అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లోకి వస్తారనే కథనాలు జోరుగా వచ్చాయి. ఆ తర్వాత వీటిపై చప్పుడు లేదు. కాగా, ఓవైపు క్యాబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.
హైదరాబాద్ వారా? జిల్లాల వారా?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉండే రంగారెడ్డి జిల్లాలో గెలిచింది ఐదు సీట్లే. అయితే, దానం నాగేందర్ సహా మరికొందరు బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరారు. ఇప్పుడు కొత్తగా మరో నలుగురు కారు పార్టీ ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెబుతున్నారు. అయితే, వారు హైదరాబాద్ నుంచా? లేక జిల్లాలకు చెందినవారా? అన్నది తెలియరావాల్సి ఉంది. కాగా, మరో 16 మంది చేరితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అయినట్లు అవుతుంది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో..
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వాటిలో బలం చాటడం కాంగ్రెస్ కు అత్యవసరం. అందుకే పార్టీలోకి వస్తామన్న ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చూస్తోంది. తద్వారా బీఆర్ఎస్ ను బలహీనం చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో రాజకీయంగా పలు అంశాల్లో టార్గెట్ చేస్తున్న ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసినట్లు అవుతోంది. కాగా, నలుగురు ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ కు చెందిన మరికొందరూ కాంగ్రెస్ లతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. చర్చల తర్వాత ఒకేసారి అందిరికీ పార్టీ కండువా కప్పాలనేది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది.
జంపింగ్ లు వీరే..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రె స్ లో చేరతారని చెబుతున్నవారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జీహెచ్ ఎంసీ కి చెందిన ఎమ్మెల్యే పేరు వినిపిస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్యే విషయంలోనే స్పష్టత రావాల్సి ఉంది. పలు ఆరోపణలు ఉండడమే దీనికి కారణం. కాగా, ఎమ్మెల్యేలు చేజారిపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తం అయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నేతల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి అంకం తర్వాత సొంత నేతలను బుజ్జగించిన తర్వాతనే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.