బీఆర్ఎస్ ను వీడే ఆ ముగ్గురు ఎంపీలు వీరే?
ఈ నేపథ్యంలో మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే రీతిన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వారు వీరే అనే ఊహాగానాలూ వస్తున్నాయి.
సారు కారు పదహారు..
గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్) ఇచ్చిన నివాదం.. అంతకు ఆరు నెలల ముందు అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన ఊపులో తెలంగాణలోని 17 సీట్లకు గాను 16 గెలుచుకునేందుకు.. సారు (కేసీఆర్), కారు (పార్టీ గుర్తు), పదహారు (తెలంగాణలోని హైదరాబాద్ మినహా 16 ఎంపీ సీట్లు) నినాదం ఇచ్చింది. అప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పూర్తిగా డౌన్ అయి ఉంది. బీజేపీకి ఒకటీ, రెండు సీట్లు మినహా గెలుచుకునే దమ్ము లేదనిపించింది. కానీ, బీజేపీ ఏకంగా నాలుగు, కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లు నెగ్గాయి. బీఆర్ఎస్ 9 సీట్లకు పరిమితమైంది. సారు, కారు, పదహారు నినాదం విఫలమైంది.
సీను పూర్తిగా రివర్స్
గత లోక్ సభ ఎన్నికలకు ఈసారికి పూర్తిగా పరిస్థితి మారిపోయింది. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రతిపక్షంలోకి మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటైంది. ఇక అధికారంలోకి వచ్చేయడమే తరువాయి అంటూ గొప్పలు పోయిన బీజేపీ మూడోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయనుకుంటే ఏకంగా బీజేపీలోకి జంపింగ్ లు మొదలయ్యాయి. బీఆర్ఎస్ చెందిన తెలంగాణలో ఆ చివరన ఉన్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఈ చివరన ఉన్న నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు ఇద్దరూ కాషాయ జెండా కప్పుకొన్నారు. పాటిల్, రాములు కుమారుడికి తొలి జాబితాలోనే సీటు దక్కింది. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే రీతిన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వారు వీరే అనే ఊహాగానాలూ వస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని ఆ ఇద్దరు
తెలంగాణలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న జిల్లాలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ గెలిచారు. గత, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ జిల్లాలో కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు అక్కడి ఎంపీ బీజేపీవైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాతో అనుసంధానమై ఉన్న రిజర్వుడ్ ఎంపీ కూడా కాషాయ పార్టీలో చేరొచ్చని చెబుతున్నారు. మూడో ఎంపీ ఎవరంటే.. హైదరాబాద్ సమీప నియోజకవర్గం వారు అని అంటున్నారు. అయితే, ఆయన నియోజకవర్గానికి తొలి జాబితాలోనే బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. దీంతో ఆ ఎంపీ పొరుగు జిల్లా నుంచి అయినా పోటీకి సిద్ధం అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురి పేర్లతో పాటు మాజీ మంత్రి కుమారుడి పేరూ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరే వారి జాబితా ఉందని వివరిస్తున్నారు.