సారుకు 'ఆరు' అదృష్టం సైతం చేజారిందా?

''ఆరు''గురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే.. తాజాగా నిన్న అర్థరాత్రి (గురువారం) ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.

Update: 2024-07-05 05:30 GMT

కొన్నిసార్లు అంతే. అప్పటివరకు వెంట ఉన్న అదృష్టం అదృశ్యమవుతుంది. ఇలాంటి వేళలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత త్వరగా లోపాల్ని అధిగమించి.. నష్టనివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా అందుకు మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజల భావోద్వేగాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి రావటమే కాదు.. తమకు ప్రత్యర్థులు అన్నదెవరూ ఉండకూదన్న అజెండాతో ఆయన పని చేసిన వైనం తెలిసిందే. వ్యవస్థల్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవటమే కాదు.. ప్రజాస్వామ్య భారతంలో సహజసిద్ధంగా ఉండాల్సిన వాక్ స్వాతంత్య్రం మీదా ఎన్నో పరిమితులు పెట్టేశారు.

ప్రభుత్వ వ్యవస్థల్ని తనకు తోచిన విధంగా వినియోగించుకుంటూ.. తనకు మాత్రమే తిరుగులేని అధికారాల్ని దఖలు పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. ఇలాంటి వాటిని ఎవరూ అంగీకరించినా.. ప్రకృతి అనేది ఒకటి ఉంటుందని.. తాము చేసే అన్ని తప్పులకు వడ్డీతో సహా లెక్క చెల్లించేలా చేస్తుందన్న చిన్న విషయాన్ని మర్చిపోయారు. సరిగ్గా ఆర్నెల్ల క్రితం.. లేదంటే మరో నెల అదనంగా వేసుకొని.. అప్పటి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇమేజ్ కానీ.. ఆయనకు తెలంగాణ రాజకీయాల మీద ఉన్న పట్టును గుర్తు తెచ్చుకొంటే.. ఇప్పుడున్న దయనీయమైన పరిస్థితుల్లో ఆయన ఉంటారని ఎవరైనా అంచనా వేశారా?

Read more!

నిజానికి ఇదంతా కూడా కేసీఆర్ స్వయంకృతాపరాధంగా చెప్పాలి. కొత్త నాయకుల్ని తయారు చేసుకోవాల్సిన ఆయన.. అందుకు భిన్నంగా బలంగా ఉండే నేతల్ని నయానో.. భయానో దారికి తెచ్చుకుంటే తనకు తిరుగు లేకుండా పోతుందని.. శత్రుశేషం అవుతుందని భావించారు. కానీ.. ఎప్పుడూ కూడా కొత్త నాయకత్వం ఎప్పటికప్పుడు పుడుతుందన్న విషయాన్ని ఆయన మరిచారు. ప్రత్యర్థుల్ని నామరూపాల్లేకుండా చేద్దామన్న దరిద్రపుగొట్టు ఆలోచన కంటే కూడా.. ప్రజారంజకంగా పాలిస్తే సరిపోతుందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. ఇదే.. ఆయన అదృష్టాన్ని మార్చేసిందని చెప్పాలి.

గులాబీ బాస్ కేసీఆర్ కు ''6'' అంకెతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు అంకెను ఆయన తన అదృష్ట సంఖ్యగా భావిస్తారు. తాను చేసే ప్రతి ముఖ్యమైన పనిలో ఆరు మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరు ఉంటే.. తనకు అదృష్టమని.. తనకు తిరుగు ఉండదన్న భావనతో ఉండేవారు. మరి..ఇప్పుడు అదే ఆరు ఆయన్ను దారుణంగా దెబ్బ తీయటం ఆసక్తికరంగా చెప్పాలి. ఆ మాటకు వస్తే ఆయన నమ్ముకున్నఅదృష్ట ఆరు.. ఇప్పుడు ఆయన రాజకీయంగా అదృశ్యమయ్యేందుకు కారణమయ్యేలా చేస్తుందన్నమాట వినిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరటం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు మూడు రోజులకే రేవంత్ సర్కారు ఆర్నెల్లలో కూలిపోతుందన్న జోస్యం చెప్పారు. అప్పుడు కూడా కేసీఆర్ 'ఆరు'నే నమ్ముకున్నారు. శుభమా అని అధికారంలోకి వచ్చిన వేళ.. ఆరు పేరుతో గులాబీ సారు చెబుతున్న జోస్యాన్ని ఆయనకు షాకిచ్చేలా చేయాలన్న పట్టుదలకు పోయినట్లుగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి.

ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలోనూ.. తాము ఫిరాయింపుల్ని ప్రోత్సహించటం లేదని.. తమ ప్రభుత్వాన్ని కూలుస్తామని.. ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ చెబుతున్నప్పుడు.. తమను తాము రక్షించుకోవటానికి ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి ప్రత్యర్థుల్ని బలహీనం చేయటంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ మాటల్ని చూసినప్పుడు.. కేసీఆర్ వేలితోనే ఆయన కన్ను పొడిచేలా చేస్తున్నారు.

అయినప్పటికీ 'ఆరు'ను వదలని కేసీఆర్ కు అదే 'ఆరు'తో అదరగొట్టేస్తున్నారు రేవంత్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటివరకు ''ఆరు''గురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే.. తాజాగా నిన్న అర్థరాత్రి (గురువారం) ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీంతో.. అటు ఎమ్మెల్యేలు.. ఇటు ఎమ్మెల్సీలు 'ఆరు'గురు చొప్పున హస్తం గూటికి రావటం చూసినప్పుడు.. గులాబీ బాస్ కు ఇప్పటివరకు అదృష్టంగా ఉన్న 'ఆరు' ఇప్పుడాయనకు షాకిస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News

eac