వామ్మో... ఎన్నికల బాండ్ల విరాళాలు రూ.11,671 కోట్లు!

ప్రాంతీయ పార్టీల్లో తెలంగాణకు చెందిన బీఆరెస్స్ టాప్ ప్లేస్ లో నిలించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆ పార్టీకి రూ.1,214 కోట్ల విరాళాలు అందాయని అంటున్నారు.

Update: 2024-03-15 04:15 GMT

ప్రైవేటు కంపెనీలకు, రాజకీయ పార్టీలకూ ఉన్న సంబంధం గురించి ఒక మహాకవి ఏమన్నాడంటే... అని మొదలుపెట్టాల్సిన పరిస్థితి! ఎందుకంటే... తాజాగా ఎన్నికల సంఘం బహిర్గతం చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను బహిర్గతం చేయడంతో ఊహించని అంకెలు దర్శనమిస్తున్నాయి. ఈ జాబితాలో బీజేపీ, త్రుణముల్ కాంగ్రెస్, కాంగ్రెస్ లు టాప్ ప్లేస్ లో ఉండగా... తెలుగు రాష్ట్రాల్లో బీఆరెస్స్, వైసీపీ, టీడీపీలకూ వందల కోట్లలో భారీగానే విరాళాలు అందాయని తెలుస్తుంది.

అవును... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్ సైట్ లో పెట్టగా.. ఈ డేటాను రెండు భాగాలుగా పేర్కొంది. ఇందులో భాగంగా 337 పేజీల డేటాను అందుబాటులో ఉంచగా.. రూ. 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కనుగోలు చేసినట్లు వెల్లడైంది. అయితే ఏ సంస్థ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందనే వివరాలు ఇంకా పొందుపరచలేదు.. అందుకు మరో 3 నెలల సమయం పడుతుందని మాత్రం వెల్లడించింది.

ఈ క్రమంలో... ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయనే వివరాలను ఫ్యాక్ట్ ఫైండర్ మహ్మద్ జుబేర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... బీజేపీకి రూ.6,061 కోట్లు, తృణమూల్ కు రూ.1,610 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ. 1,422 కోట్లు వచ్చాయి. ఇక బాండ్లను భారీగా కొనుగోలు చేసిన కంపెనీల్లో... స్టీల్ పారిశ్రామిక దిగ్గజ సంస్థ లక్ష్మీ మిట్టల్ నుంచి సునీల్ భారతీ మిట్టల్, అనీల్ అగర్వార్, ఐటీసీ, మహేంద్ర & మహేంద్ర, మెఘా ఇంజినీరింగ్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లతో పాటు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలు ఉన్నాయి.

వైరల్ గా ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ విరాళం!:

తాజాగా విడుదలైన డేటా ప్రకారం అత్యధికంగా ఎన్నికల బాండ్లను కనుగోలు చేసిన కంపెనీగా ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ రికార్డ్ నెలకొల్పింది! ఈ మేరకు ఈ కంపెనీ అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. దీంతో ఈ కంపెనీ పేరు దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. కోయంబత్తూర్ కు చెందిన శాంటియాగో మార్టిన్ ఈ కంపెనీని 1991లో ప్రారంభించారు.

ఈ క్రమంలో 13 ఏళ్లకే లాటరీలు మొదలుపెట్టిన ఈయన... "లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా"గా పేరు సంపాదించారని అంటారు! ఈయనకు రియల్టీ, ఇన్ ఫ్రా, హోటల్స్, టెక్స్ టైల్స్ రంగాలకు సంబంధించి దేశవిదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి.

మిగతా సంస్థల వివరాలు!:

ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ తర్వాత స్థానంలో క్విక్ సప్లై చైన్ సంస్థ రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా.. అనీల్ అగర్వాల్ కు చెందిన వేదాంత రూ. 400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. ఇదే క్రమంలో... హల్దియా ఎనర్జీ సంస్థ రూ.377 కోట్లు కొనుగోలు చేయగా... గాజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ రూ.162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.

ఇక స్టీల్ పరిశ్రమ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తన సొంత డబ్బుతో రూ.35కోట్ల బాండ్లను కొనగా.. ఆయన కంపెనీలు మరో రు.247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి. ఇదే క్రమంలో... ఎస్సైల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 224 కోట్లు, వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్ మిషన్ రూ.220 కోట్లు, కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ ఫ్రా లిమిటెడ్ రూ.194 కోట్లు, మదన్ లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు, డీ.ఎల్.ఎఫ్. గ్రూప్ రూ.170 కోట్లు విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి.

ఇదే క్రమంలో... జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.123 కోట్లు, ,బిర్లా కార్బన్ ఇండియా రూ.105 కోట్లు, రుంగ్తా సన్స్ రూ. 100 కోట్లు కొనుగోలు చేశారు. ఇండిగో సంస్థలు రూ.36 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.20 కోట్లు, బజాజ్ ఆటో రూ.18 కోట్లు, స్పైస్ జెట్ రూ.65 లక్షల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. ఇదే క్రమంలో వ్యక్తిగతంగా... కిరణ్‌ మజుందార్‌ షా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, వరుణ్‌ గుప్తా, మోనికా బాండ్లను కొన్నారు. ఇండిగో సంస్థకు చెందిన రాహల్‌ భాటియా రూ.20 కోట్ల బాండ్లను కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో టాప్ లో మేఘా ఇంజినీరింగ్!:

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది. అనంతరం షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్‌ లిమిటెడ్‌ రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది.

ఈ జాబితాలో... డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ రూ.80 కోట్లు, నాట్కోఫార్మా రూ.70 కోట్లు, ఎన్‌.సీ.సీ. లిమిటెడ్‌ రూ.60 కోట్లు, హెటిరో గ్రూప్‌ రూ.60 కోట్లు, నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.55 కోట్లు, దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ రూ.55 కోట్లు, అరబిందో ఫార్మా లిమిటెడ్‌ రూ.50 కోట్లు, రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.45 కోట్లు, గ్రీన్‌ కో రూ.35 కోట్లు, అపర్ణా ఫామ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ సంస్థ రూ.30 కోట్లుగా ఉన్నాయి.

ఇదే క్రమంలో... ఎన్.ఎస్.ఎల్. ఎస్.ఈ.జెడ్. హైదరాబాద్ ప్రై.లి. రూ.29 కోట్లు, కల్పతరు ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ లి. రూ.26.50 కోట్లు, మై హోం ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి. రూ.25 కోట్లు, రాజపుష్ప గ్రూప్‌ రూ.25 కోట్లు, ఏపీఎల్‌ హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్లు, నారా కన్‌ స్ట్రక్షన్స్‌ రూ.10 కోట్లు, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్లు, సోమశిల సోలార్‌ పవర్‌ లిమిటెడ్‌ రూ.7 కోట్లు, శ్రీచైతన్య స్టూడెంట్స్‌ మేనేజ్మెంట్‌ రూ.6 కోట్లు, సుధాకర్‌ కంచర్ల రూ.5 కోట్లు, కేసీఆర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఎల్‌.ఎల్‌.పీ. రూ.5 కోట్లు, ఐల్యాబ్స్‌ హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ రూ.5 కోట్లుగా ఉన్నాయి.

ప్రాంతీయ పార్టీల్లో బీఆరెస్స్ టాప్!:

తాజాగా ఎన్నికల కమిషన్ వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబందించిన వివరాల్లో తెలుగు రాష్ట్రల్లోనే కాదు.. ప్రాంతీయ పార్టీల్లో తెలంగాణకు చెందిన బీఆరెస్స్ టాప్ ప్లేస్ లో నిలించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆ పార్టీకి రూ.1,214 కోట్ల విరాళాలు అందాయని అంటున్నారు.

ప్రాంతీయ పార్టీల్లో ఆ తర్వాత స్థానాల్లో... బిజూ జనతాదళ్ కు రూ.775 కోట్లు, డీఎంకే కు రూ.639 కోట్లు, వైసీపీకి రూ.337 కోట్లు, టీడీపీకి రూ.219 కోట్లు, శివసేనకు రూ.158 కోట్లు, ఆర్జేడీకి రూ.73 కోట్లు, ఆప్‌ కు రూ.65 కోట్లు, జనతాద ళ్‌ (సెక్యులర్‌)కు రూ.44 కోట్లు విరాళాలుగా వచ్చాయని అంటున్నారు.

Tags:    

Similar News