కారుకు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలోకి గులాబీ ఎంపీలు

రాములు బాటలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు

Update: 2024-02-28 05:04 GMT

అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా వెలిగిపోయినట్లుగా కనిపిస్తుంటుంది. కానీ.. దాని అసలు పసంతా కూడా పార్టీ చేతి నుంచి అధికారం చేజారినప్పుడే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీగా వెలిగిపోయిన బీఆర్ఎస్.. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరిన్ని ఎదురుదెబ్బలు తెర మీదకు రానున్నట్లుగా చెబుతున్నారు.

ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. గులాబీ ఎంపీలు పలువురు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ఈ వాదనకు బలం చేకూరే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు కమలం గూటికి చేరుకునేందుకు లైన్ క్లియర్ అయ్యిందని చెబుతున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ పక్కా అన్న హామీతో ఆయన బీజేపీలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ చేరిక ఉంటుందని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి రాములు గైర్హాజరు అయ్యారు.

రాములు బాటలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎంపీ కూడా బీజేపీ వైపు చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి సదరు ఎంపీ గతంలో బీజేపీలో చేరేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించినా.. తర్వాత కాస్త స్పీడ్ తగ్గించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన చేరిక అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది.

బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ కచ్ఛితంగా ఇస్తే బీజేపీలో చేరేందుకు అభ్యంతరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కారు అధికారంలోకి రావటం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనిపించటం.. ప్రస్తుతం విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి ఎన్నిక కావటం కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. బీజేపీలోకి చేరటం ద్వారా మరోసారి గెలుపు బాటలో పయనించే వీలుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. గులాబీ కారుకు వరుస ఎదురుదెబ్బలకు రంగం సిద్ధమైన సంకేతాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News