ఒక వైపు రేవంత్ - మరో వైపు మోడీ.. నలుగుతున్న బీఆర్ఎస్ ..!
ఇంకోవైపు.. ఎమ్మెల్సీలను కూడా.. లాగేస్తున్నారు. ప్రస్తుతం మండలిలో కేసీఆర్‌కు బలం ఉంది.
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి గోడ దెబ్బ-చెంపదెబ్బ.. రెండూ తగులుతున్నాయా? రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డితో వేగుతున్న బీఆర్ఎస్‌కు.. ఇక, కేంద్రంలోని మోడీ వైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదురు కానున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. 2023, నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ చిత్తు అయిపోయింది. తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పిన కేసీఆర్.. ఆ ఎన్నికల్లోఊహించని పరాభవం ఎదుర్కొన్నారు. తర్వాత.. కూడా.. పార్టీ విదానాలను మార్చుకోకపోవడం.. పార్టీని గాడిలో పెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగకపోవడం గమనార్హం.
ఇక, ఆ తర్వాత కూడా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు నెల్లలో కూలిపోతుందని.. నాలుగు మాసాల్లో నలిగిపోతుందని.. ఆరు నెల్లలో కుప్పకూలుతుందనిఇలా.. రకరకాలుగా వ్యాఖ్యానించారు. దీంతో ముందు జాగ్రత్త అనుకున్నారో.. లేక.. కేసీఆర్‌కు బలమైన దెబ్బ కొట్టాలనే లక్ష్యాన్ని బలోపేతం చేసుకున్నారో.. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే లెక్కకు మిక్కిలిగా జంపింగులను ప్రోత్సహించింది. ఫలితంగా 34 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 9 మంది జంపయ్యా రు. ఇక, మరో పది మంది వరకు లాగేస్తే.. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తీసేసే అవకాశం ఉంటుంది.
ఇంకోవైపు.. ఎమ్మెల్సీలను కూడా.. లాగేస్తున్నారు. ప్రస్తుతం మండలిలో కేసీఆర్‌కు బలం ఉంది. ఏదో ఒక రకంగా.. రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టేందుకు మండలి దోపడుతుంది. దీనిని గ్రహించిన కాంగ్రెస్ అటు నుంచి డా నరుక్కొస్తోంది. ఇలా.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు నుంచి కేసీఆర్‌కు ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మరో వ్యూహానికి కూడా కేసీఆర్ చిక్కుతు న్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దెదించుతానంటూ.. ఆయన రెండేళ్లకిందట ప్రకటించారు. చెప్పినట్టుగానే.. పలువురు ముఖ్యమంత్రులను కలిసి.. ప్రత్యేక కూటమికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఈ క్రమంలోనే మోడీ కేసీఆర్‌ను బలంగా నియంత్రించే ప్రయత్నాలు చేశారు.
పనిలో పనిగా.. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణాన్ని కేసీఆర్ కు సంధించారు. దీంతో ఆయన గారాల పట్టి కవిత.. జైలు పాలైంది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో ఏర్పడిన చిక్కుల ఫలితంగా.. కేసీఆర్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిని పోయింది. ఇక, ఇప్పుడు ఉన్నది రాజ్యసభపై ఆశలు మాత్రమే.. ఇప్పుడు వీరిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ నిమగ్నమైందనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగి ప్రస్తుతం బీఆర్ ఎస్‌కు ఉన్న నలుగురు రాజ్యసభసభ్యల్లో ఇద్దరు జారుకున్నా.. ఆ పార్టీకి ఇబ్బందే. దీనిని ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ తోనూ.. కేంద్రంలో మోడీతోనూ.. కేసీఆర్‌కు చిక్కులే.. చిక్కులు వచ్చాయని అంటున్నారు పరిశీలకులు.