బీఆర్ఎస్‌లో టికెట్ల కొట్లాట‌

బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోతే ఇత‌ర పార్టీల్లో చేరేందుకూ ఈ నాయ‌కులు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని స‌మాచారం

Update: 2023-07-29 07:58 GMT

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌రప‌డుతున్న కొద్దీ అన్ని పార్టీల‌కు టెన్ష‌న్ పెరిగిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి, సీట్ల కేటాయింపు, వ‌ర్గ పోరు, అసంతృప్తి సెగ‌లు.. ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు. అధికార బీఆర్ఎస్ పార్టీకీ ఈ ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.

ఇంకా చెప్పాలంటే ఈ పార్టీలోనే ఈ స‌మ‌స్య ప్ర‌ధానంగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం కొట్లాట జ‌రుగుతోంద‌ని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోతే ఇత‌ర పార్టీల్లో చేరేందుకూ ఈ నాయ‌కులు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని స‌మాచారం.

తాండూర్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి మ‌ధ్య టికెట్ కోసం విభేదాలున్నాయ‌ని తెలిసిందే. త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోతే మ‌హేంద‌ర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాల‌ని చూస్తున్నార‌ని స‌మాచారం. స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌, ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి ఇప్ప‌టికే బ‌హిరంగంగా ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

కోదాడ‌లో ఎమ్మెల్యే మ‌ల్ల‌య్య యాద‌వ్‌పై సీనియ‌ర్ నేత‌లు అసంతృప్తితో ఉన్నారు. మ‌హేశ్వ‌రంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో విభేదాల కార‌ణంగా తీగ‌ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

అలాగే ఆసిఫాబాద్‌, వ‌ర్ధ‌న్న‌పేట, న‌ర్సంపేట‌, వ‌రంగ‌ల్ తూర్పు, ముధోల్‌, చెన్నూర్‌, బెల్లంప‌ల్లి, నాగార్జున సాగ‌ర్‌, న‌ల్గొండ‌, న‌కిరేక‌ల్‌, రామగుండం.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సొంత పార్టీ నాయ‌కుల నుంచే వీళ్లు అసంతృప్తి ఎదుర్కుంటున్నారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు, యాత్ర‌లు నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి లాంటి ప‌లువురు మంత్రుల‌కూ ఈ అసంతృప్తి సెగ త‌ప్ప‌డం లేదు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు కాకుండా త‌మ‌కే టికెట్ ఇవ్వాలంటూ ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌రి ఈ అసంతృప్తుల‌ను కేసీఆర్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

Tags:    

Similar News