బీఆర్‌ఎస్ లో విలీనమైన మరో పార్టీ ఇదే!
ఆ రాష్ట్రానికి చెందిన స్వరాజ్య మహిళ సంఘటన్ బీఆర్‌ఎస్ లో విలీనమైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే,
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్నారు.. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే వేసవిలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనూ వీలైనన్ని స్థానాలు సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు.
ఈ క్రమంలో తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రం.. మహారాష్ట్రపైన కేసీఆర్ దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. తరచూ ఆ రాష్ట్రంలో పర్యటించడంతోపాటు పలు బహిరంగ సభలను కూడా ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల చోటా మోటా నేతలు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఓవైపు వివిధ పార్టీల నేతలను చేర్చుకుంటున్న కేసీఆర్ మరోవైపు చిన్నాచితక పార్టీలను సైతం బీఆర్‌ఎస్ లో విలీనం చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ లో మరో పార్టీ విలీనమైంది. ఈ పార్టీ కూడా మహారాష్ట్రదే కావడం గమనార్హం. ఆ రాష్ట్రానికి చెందిన స్వరాజ్య మహిళ సంఘటన్ బీఆర్‌ఎస్ లో విలీనమైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే, ఆ పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ సమక్షంలో పార్టీని విలీనం చేసి బీఆర్‌ఎస్ లో చేరారు.
స్వరాజ్య మహిళా సంఘటన్ పార్టీ నేతలతో పాటు మహారాష్ట్ర బీజేపీ నాయకులు భయ్యా సాహెల్ పాటిల్, అర్జున్ వాంఖడే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ జయంత్ చౌదరి, శివసేన నాయకుడు దత్తరాజ్ దేశ్ ముఖ్ తదితరులు కూడా బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే స్టేట్ యూనియన్ వర్కర్ (సభ్యుడు) రామ్ రావ్ షిండే పాటిల్, మహిళా అఘాడీకి చెందిన మనిషా చౌదరి, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భయ్యా సాహెబ్ పాటిల్, మహాగావ్ తాలూకా సభాపతి నరేంద్ర ఖదారే, పంచాయతీ సమితి సభాపతి సురేష్ మిస్రవ్, శంభాజీ బ్రిగేడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మొహాలే, శివసేన జిల్లా సచివ్ దత్తరాజ్ దేశ్ ముఖ్ తదితరులు కూడా బీఆర్‌ఎస్ లో చేరినవారిలో ఉన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని.. ఈ పథకాలు మహారాష్ట్రలో అమలు కావాలని అందుకే తాను బీఆర్‌ఎస్‌లో చేరానని స్వరాజ్య మహిళ సంఘటన్ అధ్యక్షురాలు వనితా తాయి తెలిపారు.
నిరుపేదలు, పీడితులు, అసహాయులు, వితంతువుల సంక్షేమం, స్వావలంబన కోసం ఇన్నాళ్లూ స్వరాజ్య మహిళా సంఘటన కృషి చేసిందని వనితా తాయి తెలిపారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ లో తాము విలీనం కావడంతో ఇక నుంచి ఆ పార్టీతో కలిసి నడుస్తామని వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ ను విస్తరింపచేస్తామని చెప్పారు.