సాయిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయండి: టీడీపీ ఫైర్ బ్రాండ్ ఫిర్యాదు
వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిపై విజయవాడ పోలీసు కమిషనర్ రాజ శేఖర్‌బాబుకు టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా ఫిర్యాదు చేశారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిపై విజయవాడ పోలీసు కమిషనర్ రాజ శేఖర్‌బాబుకు టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా ఫిర్యాదు చేశారు. సాయిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన కోరారు. దీంతో రాష్ట్రంలో తొలిసారి సాయిరెడ్డిపై రాజకీయ పరమైన తొలి ఫిర్యాదు అందినట్టు అయింది. అయితే.. దీనిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
ఏం జరిగింది?
గత రెండు రోజులుగా సాయిరెడ్డి సీఎం చంద్రబాబుపై నోరు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముస లాయన, 75 ఏళ్ల కురువృద్ధుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదేవిధంగా ``ఆయన బతికి ఉంటే .. `` అని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ అభిమానులకు, ముఖ్యంగా చంద్రబాబును అభిమానించే వారికి ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే. అనేక మంది సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు.
ఇక, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. బుద్దా వెంకన్న విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశా యని, తమకు మానసికంగా క్షోభ కలిగించేలా సాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని.. కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి.. తగు నిర్ణయం తీసుకుంటామని సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు.