వంశీనే కాదు.. మరో నలుగురు త్వరలో అరెస్టు : బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు నేపథ్యంలో మరికొందరిని అరెస్టు చేస్తామని ప్రకటించారు

Update: 2025-02-15 06:33 GMT

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు నేపథ్యంలో మరికొందరిని అరెస్టు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన నేతలు అందరినీ అరెస్టు చేస్తామని బుద్దా వెల్లడించారు. వంశీ అరెస్టు నెక్ట్స్ ఎవరు అన్న? ప్రశ్నలు ఉదయిస్తున్న సమయంలో బుద్దా కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి.

ప్రతిపక్ష వైసీపీలో కీలక నేతలను టార్గెట్ చేసినట్లు టీడీపీ ప్రకటనలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నోటి దురుసుతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే వంశీ అనూహ్యంగా అరెస్టు అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై ఆరోపణలు ఉండగా, ఆ కేసులో బాధితుడిని కిడ్నాప్ చేశారని అభియోగాలతో తాజాగా కేసు నమోదు చేసి వంశీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో వంశీ తర్వాత ఎవరు? అన్న ప్రశ్న తలెత్తింది. గత ఏడాది జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస అరెస్టులు జరుగుతున్నాయి. అంతకుముందు ఐదేళ్లలో నమోదైన కేసులపై తాజాగా చర్యలు తీసుకుంటోంది.

వివిధ కేసులను ఎదుర్కొంటున్న నేతల్లో చాలా మందిపై అరెస్టు కత్తి వేలాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేశ్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అవ్వగా, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాయలసీమకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు టీటీడీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై ఒకరిద్దరు వైసీపీ నేతలను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బుద్దా వెంకన్న చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

వంశీనే కాదు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు సైతం అరెస్టు చేస్తామంటూ బుద్దా వెంకన్న వెల్లడించారు. కొడాలిపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. పేర్ని నాని కూడా బియ్యం అక్రమ తరలింపు కేసులో ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుతానికి వెలంపల్లి, అంబటిపై ఎలాంటి తీవ్రమైన కేసులు లేవు. ఇప్పుడు బుద్దా వెంకన్న కామెంట్స్ తో వారిపైనా ఏదైనా కేసు నమోదు చేస్తారా? అనేది చర్చనీయాంశమవుతోంది.

Tags:    

Similar News