ఇదిగో.. ఇలాంటి కుళాయిలనే బంద్ చేయాలి బాబూ!
ఓవర్ హెడ్ ట్యాంక్ బాగానే ఉంది. కానీ, కుళాయిలే దుర్వాసన కొడుతున్నాయి. ఇంకా మార్పు రాలేదు.
ఓవర్ హెడ్ ట్యాంక్ బాగానే ఉంది. కానీ, కుళాయిలే దుర్వాసన కొడుతున్నాయి. ఇంకా మార్పు రాలేదు. ``జరిగిందేదో జరిగిపోయింది.. గత సంగతులు వదిలేద్దాం. ప్రజల సమస్యలు. పాలనపై దృష్టిపెడదాం`` అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించినా.. నిండు అసెంబ్లీలో మాట్లాడినా.. చంద్రబాబు ఇదే పాఠం చెబుతున్నారు. కానీ, ఆయన మాటలను దిగువ స్థాయి నాయకులు మాత్రం వినిపించుకోవడం లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఉద్రిక్తతలు పెంచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు గా ఇలాంటి వారిని కట్టడి చేయాలన్నది ప్రజలు కోరుతున్నారు.
ఏం జరిగింది?
గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి.. మాజీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ టీడీపీ నాయకుడు.. బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ``పెళ్లాం, పిల్లలతో.. పెట్టె బెడ సర్దుకొని వెళ్లాలి`` అని హుకుం జారీచేశారు. లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొడాలి నాని రెచ్చిపోయారని, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేశారిన ఆయన అన్నారు. ప్రభుత్వం మారడంతో కొడాలి నాని తదితరులకు గడువు విధించామన్నారు. ఆ గడువు దాటిపోతోందని.. తక్షణమే ఊరు , ఇల్లు వదిలి కట్టుబట్టలతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసేవారిని వదిలిపెట్ట బోమని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, జోగి రమేష్ లాంటి వారు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే బుద్ది చెబుతామని స్పష్టం చేశారు. కొడాలి నాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ``నానీకి ఇచ్చిన గడువు ముగిసింది. పెళ్లాం, పిల్లలతో ఊరు వదిలి కట్టుబట్టలతో వెళ్లిపోతే ఆయనకే మంచిది. అలా వెళితే వదిలేస్తాం అని స్పష్టం చేశారు. కాదు కూడదని.. ఇక్కడే ఉంటూ... పిచ్చి ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకోబోం`` అని వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీకి మంచిదేనా?
ఇలాంటి నాయకుల వల్ల టీడీపీ కి మంచిదేనా ? అంటే కాదనే అంటున్నారు పరిశీలకులు. ప్రజాప్రతినిధి గా ఒక్కసారి కూడా గెలవని బుద్దా వెంకన్నకు ఇంత దురద ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ వారు తప్పు చేశారనే కదా.. ప్రజలు వారిని ఓడించారని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే బాట పడితే.. మళ్లీ ఎన్నికలు వస్తాయని.. అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని అంటున్నారు. ఇలాంటి వారిని చంద్రబాబు కంట్రోల్ చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.