నన్ను వదిలేయండి అంటున్న బుగ్గన.. అవి మాత్రం ఆగడం లేదు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సైతం 2019తో పోలిస్తే ఈసారి ఏకంగా దాదాపు 30 వేల వరకు మెజార్టీ తగ్గిపోయింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. వైనాట్ 175 అంటూ చివరకు 11 సీట్లకే చాప చుట్టేసింది. గెలిచిన 11 మందిలోనూ అత్యధికులు బొటాబొటీ మెజారిటీలతో గెలిచినవారే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సైతం 2019తో పోలిస్తే ఈసారి ఏకంగా దాదాపు 30 వేల వరకు మెజార్టీ తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు, కేసుల భయంతో మరికొందరు వైసీపీ నేతలు వేరే పార్టీల్లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తమపై కేసులు పెడుతుందనే భయం ఉన్నవారు బీజేపీలో చేరిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇలాంటివారిలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఆయన కర్నూలు జిల్లా డోన్ నుంచి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో బుగ్గన.. టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
కాగా 2014లో కూడా బుగ్గన డోన్ నుంచి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో గెలిచి ఉంటే హ్యాట్రిక్ సృష్టించేవారు. అయితే ఓడిపోవడంతో హ్యాట్రిక్ సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్రంలోనూ, ఆయన నియోజకవర్గంలోనూ కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. నియోజకవర్గ నేతలకు, పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేరని అంటున్నారు. ఇటీవల వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో నిర్వహించిన సమీక్ష సమావేశాలకు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ హాజరు కాలేదని చెబుతున్నారు.
ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ న్యూఢిల్లీలో మకాం వేశారని అంటున్నారు. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ఎక్కువ భాగం ఢిల్లీ చుట్టూ తిరగడానికే వెచ్చించేవారు. తరచూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు కేంద్ర ఆర్థిక విభాగం అధికారులను కలిసి రుణ మంజూరు పెంపు, బకాయిల చెల్లింపులు వంటివాటిపై చర్చించేవారు.
ఈ క్రమంలో గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు హాట్ టాపిక్ గా మారాయి. సంక్షేమం పేరుతో భారీ ఎత్తున అప్పులు చేసి ప్రజలకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా మారడానికి ఆర్థిక మంత్రిగా బుగ్గన కూడా ఒక కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతుండటంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలో ఆందోళన నెలకొందని అంటున్నారు.
అందులోనూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లోనూ మైనింగ్, సిమెంట్ వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీకి వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తనను ఇబ్బందిపెట్టకుండా ఉండాలంటే బీజేపీలో చేరడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను, ప్రచారాలను బుగ్గన రాజేంద్రనాథ్ ఖండిస్తున్నారు. తనపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారడం లేదని ఆయన చెబుతున్నారు. అయితే పుకార్లు, వార్తలు మాత్రం ఆగడం లేదు.
అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు బుగ్గన పార్టీ మారడానికి ప్రయత్నించకపోతే ఈ ప్రచారాలు ఎందుకు జరుగుతాయని నిలదీస్తున్నారు. ఏమో ఏమైనా కావచ్చని అని అంటున్నారు. చూద్దాం.. ఈ ఎపిసోడ్ లో ఏమవుతుందో!