నా భార్యకు టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారు!
ఇదే కేసులో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా పదేళ్ల జైలుశిక్ష పడింది.
ప్రధానిగా అధికారంలో ఉన్నప్పుడు దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇదే కేసులో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా పదేళ్ల జైలుశిక్ష పడింది.
ఈ ఒక్క కేసే కాకుండా ఇతర కేసుల్లోనూ ఇమ్రాన్ ఖాన్ కు జైలుశిక్ష పడింది. అంతేకాకుండా ఒక అవినీతి కేసులో ఇమ్రాన్ సతీమణి బుష్రా బీబీకి కూడా జైలుశిక్ష పడింది. ఆమె సైతం జైలులోనే ఉన్నారు.
ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్న తన సతీమణి బుష్రా బీబీకి ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలిపి ఇస్తున్నారని బాంబుపేల్చారు.
ఈ విషపూరిత ఆహారం తిన్న వెంటనే తన భార్య తీవ్ర కడుపునొప్పికి గురవుతున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలపడం వల్ల ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందన్నారు. తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
తన సతీమణి అరెస్టు కావడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కారణమని ఆరోపించారు. తాను బతికున్నంత వరకు మునీర్ ను వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
190 మిలియన్ల పౌండ్ల అవినీతి కేసు విచారణలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ ను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా ఈ సందర్భంగా ఇమ్రాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన సతీమణికి తగిన వైద్యపరీక్షలు కూడా చేయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జైలులో తాను ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేకుండా చేశారని ఇమ్రాన్ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఇందుకోసం అదనంగా బ్యారెల్స్ ఏర్పాటు చేశారని న్యాయమూర్తికి నివేదించారు.
కాగా ఇటీవల కూడా ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి ఆరోపణలే చేయడం గమనార్హం. ఆర్మీ జనరల్ మునీర్ తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ, అక్రమ నిర్ణయాలను ప్రపంచానికి వెల్లడిస్తానని ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా పాకిస్థాన్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్ – ఇ–ఇన్సాఫ్ పార్టీ అత్యధికంగా 93 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అయితే అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు పలు కేసుల్లో శిక్షపడటంతో ఆయనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆయనను ఎన్నికల్లో పోటీ చేయడానికి కోర్టు అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా క్రికెట్ లో ప్రపంచంలోనే ఉత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ 1992లో తన కెప్టెన్సీలో పాకిస్థాన్ కు వన్డే వరల్డ్ కప్ ను సాధించిపెట్టారు. ఆ తర్వాత మళ్లీ పాకిస్థాన్ వన్డే వరల్డ్ కప్ ను సాధించలేకపోవడం గమనార్హం.