ఈసారి పెళ్లిళ్ల సీజన్ యాపారం లెక్క తెలిస్తే నోట మాట రాదంతే
ఈ నవంబరు.. డిసెంబరులలో దేశ వ్యాప్తంగా 35 లక్షల వరకు పెళ్లిళ్లు జరుగుతాయన్నది అంచనా.
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటూ మన పెద్దోళ్లు వందల ఏళ్ల క్రితమే చెప్పేశారు. ఈ మాట చాలు.. మన కల్చర్ లో పెళ్లికి వేసే పెద్ద పీట ఎంతన్నది. మరో రెండు నెలల్లో పెళ్లిళ్ల సీజన్ రానుంది. నవంబరు.. డిసెంబరులో వచ్చే పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. భారత సమాజంలో పెళ్లిళ్లకు ఇచ్చే ప్రాధాన్యత.. దాని కోసం చేసే ఖర్చు.. తమ తాహతుకు మించి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఖర్చు చేసేయటం తెలిసిందే. ఈ నవంబరు.. డిసెంబరులలో దేశ వ్యాప్తంగా 35 లక్షల వరకు పెళ్లిళ్లు జరుగుతాయన్నది అంచనా.
పెళ్లి అంటే ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని వస్తువులు కొనాల్సి ఉంటుంది. ఇందుకు బోలెడన్ని వ్యాపార వర్గాల వారు భాగస్వామ్యం అవుతారు. ఇప్పటివరకు పెళ్లిళ్లు.. పెళ్లి వేడుకల నిర్వహణకు ప్రైవేటు వ్యక్తులు చేపట్టేవారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులు.. ఉపకరణాల్ని అందించే సంస్థలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సంస్థలు ఏటా నమోదు చేసే టర్నోవర్ లో సగానికి పైనే పెళ్లిళ్ల సీజన్ లోనే నమోదు కావటం చూస్తే.. పెళ్లిళ్ల సీజన్ ఆ సంస్థలకు ఎంత కీలకమన్నది అర్థమవుతుంది.
ఈసారి దసరా పండుగ తర్వాత నుంచి పెళ్లిళ్లకుమంచి ముహుర్తాలు ఉన్నాయి. దీంతో.. మొదలయ్యే పెళ్లిళ్ల సీజన్ డిసెంబరు వరకు సాగనుంది. దేశ వ్యాప్తంగా వచ్చే పెళ్లిళ్ల సీజన్ లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయన్నది అంచనా. ఇందుకోసం రూ.4.25 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ అయిన ప్రభుదాస్ లీలాధర్ తన తాజా నివేదికలో అంచనా వేశారు.
గడిచిన కొద్దికాలంగా విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటం ఒక ట్రెండ్ గా మారటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా మన దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు అనువుగా ఉండే కేంద్రాల్ని సిద్ధం చేయటమే కాదు.. పర్యాటక శాఖ 25 పర్యాటక కేంద్రాల్ని ఎంపిక చేసింది. ప్రస్తుతం మన దేశం నుంచి పలువురు సింగపూర్.. దుబాయ్.. లండన్ తదితర ప్రదేశాల్లో పెళ్లిళ్ల కోసం వెళుతున్నారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం సంపన్నులు పెట్టే ఖర్చు ఏటా రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందన్న అంచనా ఉంది.
ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కారణంగా విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశం కోల్పోతోంది. అందుకే.. దీన్ని తగ్గించుకోవటానికి దేశీయంగా పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించుకోవటానికి అవసరమైన వేదికలు.. సదుపాయాలు.. ప్రత్యేక ఆకర్షణల కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక.. పెళ్లిళ్ల సీజన్ లో పెద్ద ఎత్తున వ్యాపారాలకు అవకాశం ఉన్న రంగాల విషయానికి వస్తే.. పలు రంగాల్ని గుర్తించారు. అందులో ఎక్కువగా లాభపడే రంగాల్ని చూస్తే..
- బంగారు.. వెండి ఆభరణాల విక్రయ సంస్థలు
- ట్రావెల్ అండ్ టూరిజం
- ఆలంకరణ.. ఈవెంట్ మేనేజ్ మెంట్
- విమానయాన సంస్థలు
- ఫ్యాషన్ దుస్తులు.. లగ్జరీ వస్తువులు
- వాహనాలు
- లగేజ్.. వాచ్ లు
- హోటళ్లు.. కన్వెన్షన్ సెంటర్లు.. క్యాటరింగ్ సంస్థలు
మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పెళ్లిళ్ల సీజన్ వస్తుందంటే చాలు.. స్టాక్ మార్కెట్ సైతం కళకళలాడుతుంది. రిటైల్.. అతిథ్యం.. జువెలరీ.. వాహన రంగ సంస్థల అమ్మకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి.. ఆయా కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపురులు ఆసక్తి చూపుతారని చెబుతారు. పండుగ సీజన్ లోనూ మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం కనిపిస్తుంది. పెళ్లిళ్ల సీజన్ అంటే.. పెళ్లిళ్లు జరిగే ఇంట్లోనే కాదు.. మిగిలిన ఎన్నో వ్యాపార రంగాల్లోనూ పెళ్లికళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పాలి.