పోటీలో నువ్వా-నేనా: రేవంత్‌కు మంత్రి వర్గ విస్తరణ సవాలేనా?
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సందడి ముగిసింది. నిన్న మొన్నటి వరకు.. మోగిన మైకులు మూగ బోయాయి.
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సందడి ముగిసింది. నిన్న మొన్నటి వరకు.. మోగిన మైకులు మూగ బోయాయి. ఇక, ఇప్పుడు సర్కారు విషయంలో సందడి మొదలైంది. మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం.. ఆసక్తిగా మారింది. గత ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ కేబినెట్ ఏర్పడింది. సీఎం రేవంత్ సహా 12 మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే.. కేబినెట్‌లో మరో ఆరు ఖాళీలు ఉన్నా యి. వీటిని భర్తి చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. దీంతో ఈ ఎన్నికల అనంతరం కేబినెట్‌ను భర్తీ చేస్తా మని.. పార్టీ నుంచి సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో అధిష్టానం దృష్టిలోపడేందుకు చాలా మంది నాయకులు ఎన్నికల వేళ చెలరేగి మరీ పనిచేశారు. వీరితోపాటు.. మరి కొందరు కాంగ్రెస్ అధిష్టానాన్ని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. వీరిలో సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉన్న దానం నాగేందర్ కూడా ఉన్నారు. ఆయన బీఆర్ ఎస్‌లో గెలిచి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఆ వెంటనే ఎంపీగా కూడా టికెట్ దక్కించుకున్నారు. కానీ, సికింద్రాబాద్‌లో బీజేపీ గెలిచే అవకాశం ఉం టుందన్న అంచనాల నేపథ్యంలో ఆయన కూడా మంత్రి వర్గ రేసులో ఉన్నారు. కుల సమీకరణల్లో భాగంగా కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది.
అదేసమయంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పార్టీ నుంచి మారి వచ్చేందుకు సిద్ధమేనని.. అయితే..తనకు కూడా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంపైనే ఆయన రాక ఆధారపడి ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలంటే.. మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకుంటే బెటర్ అనే దిశగా కూడా పార్టీ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా.. మంత్రి వర్గం విస్తరణ విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ఇదిలావుంటే.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జూన్ 4 వతేదీ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకు నే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఇంతలోనే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు రానున్నాయి. వీటన్నిం టినీ పరిగణనలోకి తీసుకుంటే.. మంత్రి వర్గ విస్తరణ మరింత జాప్యం జరిగే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రి వర్గం ఎప్పుడు ఏర్పడినా.. కరీంనగర్, హైదరాబాద్‌లకు మాత్రం స్థానం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.