కేసీయార్ క్యాబినెట్ మీటింగ్ ఇందుకేనా ?
డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో 4వ తేదీన కేసీయార్ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు
డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో 4వ తేదీన కేసీయార్ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఫలితాలు వచ్చేస్తున్న సమయంలో కేసీయార్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవటం ఏమిటనే విషయమై చాలామంది ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ నేతలైతే క్యాబినెట్ మీటింగ్ కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషనర్ ను కలిసి పిర్యాదు కూడా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతున్న కేసీయార్ క్యాబినెట్ మీటింగ్ పెట్టడం ఏమిటని హస్తం పార్టీ నేతలు విచిత్రమైన వాదనలు లేవనెత్తారు.
అయితే ఇక్కడ వాళ్ళు మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే ప్రభుత్వంలో కొన్ని ప్రొసీజర్లుంటాయి. ప్రభుత్వం చేతులు మారాలంటే నిబంధనలను పాటించాల్సిందే. ఇక్కడ విషయం ఏమిటంటే కౌంటింగ్ ఫలితాల్లో గాని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేలదు. ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టాల్సిందే. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా ముందు కేసీయార్ మంత్రివర్గాన్ని రద్దుచేయాలి. కేసీయార్ రాజీనామా చేస్తే మంత్రివర్గమంతా రాజీనామా చేసినట్లే.
మంత్రివర్గం రాజీనామా చేయటం వేరు రద్దవటం వేరు. అందుకనే కేసీయార్ రాజీనామా చేస్తు మంత్రివర్గాన్ని రద్దు చేసినట్లు తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదానికి పంపాలి. తీర్మానంపై గవర్నర్ ఆమోదముద్ర పడాలి. ఇదే సమయంలో మంత్రివర్గాన్ని రద్దుచేసుకుంటే తీర్మానం సమయంలోనే అసెంబ్లీని కూడా రద్దు చేస్తున్నట్లు గవర్నర్ కు సిఫారసు చేయాలి. ఎందుకంటే అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16 వరకు ఉంది కాబట్టే. తాను రాజీనామా చేయటం కేసీయార్ ఇష్టం. మంత్రివర్గం రద్దు అన్నది క్యాబినెట్ కలెక్టివ్ డెసిషన్.
అయితే అసెంబ్లీ రద్దు కేసీయార్ చేతిలో లేదా క్యాబినెట్ చేతిలో లేదు. అసెంబ్లీ రద్దు చేయాల్సింది గవర్నర్ మాత్రమే. అందుకు ముఖ్యమంత్రి, క్యాబినెట్ సిఫారసు చేయాలి. ఇవన్నీ జరగాలంటే ముందు ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశం పెట్టాలి. అందుకనే కేసీయార్ 4వ తేదీన క్యాబినెట్ సమావేశం పెడుతున్నది. ఒకవేళ బీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చినా ఈ ప్రొసీజర్ను కేసీయార్ ఫాలో అవ్వకతప్పదు. కొత్తగా ప్రమాణస్వీకారం చేయాలంటే ముందు తాను రాజీనామా చేసి, క్యాబినెట్ ను రద్దుతో పాటు అసెంబ్లీ రద్దుకు కూడా సిఫారసు చేయాల్సిందే. ఇపుడున్న అసెంబ్లీ రద్దయితేనే కొత్త అసెంబ్లీ కొలువు తీరేది.