ప్రచారం మొదలెట్టేసిన పేర్ని కిట్టు...మిగిలిన వారసుల కధ...?
ఏపీలో వారసులు చాలా మందికి రాజకీయాల్లోకి రావాలని ఉంది. టీడీపీలో కూడా అలా చాలా మంది చంద్రబాబు ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు
ఏపీలో వారసులు చాలా మందికి రాజకీయాల్లోకి రావాలని ఉంది. టీడీపీలో కూడా అలా చాలా మంది చంద్రబాబు ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి టీడీపీ నుంచి యువత అంటే వారసుల జాబితాగా చాలా మంది కనిపించనున్నారు.
మరి వైసీపీలో అలాంటి పరిస్థితి ఉందా అంటే చాలా పరిమితంగా అని అంటున్నారు. ఎందుకంటే సీనియర్లకే ఈసారి కూడా చాన్స్ అని జగన్ అంటున్నారు. అది కూడా ఎంపీగా కూడా పోటీ చేయిస్తామని వారి సీట్లలో కొత్త ముఖాలను తప్ప ఇంటి ముఖాలను కాదని కూడా చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఈ రకమైన కండిషన్లకు అతీతంగా కొందరు సీనియర్ నేతలు ఉన్నారని అంటున్నారు. వారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. ఆయన అంటే వైఎస్సార్ కి ఇష్టం. జగన్ కి కూడా ఇష్టమే. నాని మంత్రి కోరికను జగన్ తీర్చారు. 2024 ఎన్నికల్లో కూడా నానినే పోటీ చేయమని కోరారు. కానీ ఆయన మాత్రం తన కుమారుడికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఇపుడు చూస్తే మచిలీపట్నంలో పేర్ని కిట్టుని 2024లో గెలిపించాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. ఆయన విజయవాడలో జరిగిన బీసీల సభలో మాట్లాడుతూ బీసీలకు జగన్ చేసిన మేలు ఎవరూ చేయలేదు అన్నారు. అలాగే చాలా మందికి ఆయన రాజకీయ జీవితం ఇచ్చారని అన్నారు.
ఇక మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టునే అభ్యర్ధి అని అనిల్ కుమార్ యాదవ్ ప్రచారం చేయడం బట్టి చూస్తే జగన్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అన్న చర్చ నడుస్తోంది. ఇక తిరుపతి అసెంబ్లీ టికెట్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి కన్ ఫర్మ్ అయింది అని అంటున్నారు
ఇలా కొంతమంది వారసులకు పోటీకి లైన్ క్లియర్ అయింది అని అంటున్నారు. అయితే ఇంకా చాలా మంది తమ వారి కోసం ట్రై చేస్తున్నారు అని అంటున్నారు. అలాంటి లిస్ట్ తీసుకుంటే అమలాపురం నుంచి మంత్రి విశ్వరూప్ తన కుమారుడికి టికెట్ కోరుతున్నారని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రాలో సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తమ వారసులకు టికెట్ అడుగుతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. అదే వరసలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణ దాస్ కూడా కుమారుడి కోసం ట్రై చేస్తున్నారని అంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ది అదే మాట అంటున్నారు.
మరి కొంతమంది వారసులకే టికెట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోతే ఊరుకుంటారా అన్నది ఒక చర్చ. అదే విధంగా ఈసారి మచిలీపట్నం టికెట్ జనసేనకు ఇస్తారని అంటున్నారు. టీడీపీ జనసేన కలసి పోటీ చేస్తాయని కూడా తెలుస్తోంది. మరి ఇంతటి కీలకమైన పోరులో పేర్ని నానిని బరిలోకి దించకుండా పేర్ని కిట్టుని దించుతారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.