భారత్‌ వ్యతిరేక శక్తులకు కెనడా ఊతం!

కాగా గత కొన్నేళ్లుగా కెనడాలో భారత వ్యతిరేక శక్తులు పెచ్చుమీరుతున్నాయి. ఎన్నోసార్లు భారత్‌ ఈ విషయంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.

Update: 2023-09-20 00:30 GMT

కెనడా ఖలిస్తానీ నేత హరదీప్‌ సింగ్‌ హత్య వ్యవహారం భారత్‌ –కెనడాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. కెనడాలో జూన్‌ 18న హరదీప్‌ సింగ్‌ హత్యకు గురయ్యాడు. అతడు అంతకుముందు భారత్‌ పై తీవ్ర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ హత్యను భారత్‌ ప్రభుత్వ ఏజెంట్లు చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడం భారత్‌ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా భారత దౌత్యవేత్తను కెనడా తన దేశం నుంచి బహిష్కరించడంతో భారత్‌ అగ్గిమీద గుగ్గిలమైంది. దీనికి ప్రతిగా భారత్‌ లో కెనడా రాయబారిని దేశం నుంచి ఐదు రోజుల్లోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా గత కొన్నేళ్లుగా కెనడాలో భారత వ్యతిరేక శక్తులు పెచ్చుమీరుతున్నాయి. ఎన్నోసార్లు భారత్‌ ఈ విషయంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. అక్కడ తరచూ హిందూ దేవాలయాల పైన దాడులు చేయడం, భారత్‌ జెండాను అవమానించడం తరచూ జరుగుతున్నాయి. ఆగస్టులో ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో లక్ష్మీనారాయణ మందిర్‌ ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా జూన్‌ 18న జరిగిన హరదీప్‌ సింగ్‌ హత్యపై కెనడా దర్యాప్తు చేస్తుంది అని పోస్టర్లు అంటించారు.

ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా అదే పల్లవి అందుకున్నారు. భారత్‌ ఏజెంట్లే హరదీప్‌ ను చంపారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఓ పార్టీ మెప్పు కోసం కెనడా ప్రధాని.. మొదట్నుంచీ ఖలిస్థానీ విషయంలో భారత్‌ పట్ల పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

2021 తర్వాత నుంచి ట్రూడో ప్రభుత్వం ఖలిస్థానీ వేర్పాటువాదులకు అండదండలు అందిస్తోంది. కెనడాలో భారీ ఎత్తున సిక్కు ఓటర్లు ఉన్నారు. వారి మద్దతు పొందడం కోసం వారు ఏం చేసినా జస్టిన్‌ ట్రూడో వెనకేసుకొస్తున్నారు.

2021 ఎన్నికల్లో ఆ దేశ పార్లమెంటు అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో ఉన్న మొత్తం 338 స్థానాల్లో ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ సీట్లు 177 నుంచి 150కి తగ్గాయి. అదే సమయంలో కన్జర్వేటీవ్‌ పార్టీకి 121, నేషనల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ)కి 24, బ్లాక్‌ క్యూబెక్స్‌ కు 32, గ్రీన్‌ పార్టీకి 3, స్వతంత్య్ర అభ్యర్థికి ఒకటి చొప్పున సీట్లు వచ్చాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు ట్రూడోకు మరికొన్ని సీట్ల అవసరం పడింది. దీంతో జగ్మీత్‌ సింగ్‌ ధాలివాల్‌ (జిమ్మీ) నేతృత్వంలోని ఎన్‌డీపీ మద్దతు తీసుకొన్నారు. ఎన్‌డీపీ నాయకులు ఇప్పటికే ఖలిస్థానీ వేర్పాటువాదులకు, వారి ఎజెండాకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2013లో జగ్మీత్‌ కు భారత్‌ వీసాను తిరస్కరించింది. ప్రస్తుతం అటువంటి వ్యక్తి నేతృత్వంలోని పార్టీ వల్లే ట్రూడో ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. దీంతో ట్రూడో కూడా భారత్‌ వ్యతిరేకతను చాటుకుంటున్నారు.

ఎన్‌డీపీ నేత జగ్మీత్‌ సింగ్‌ కేవలం ఖలిస్థానీ వేర్పాటువాదానికే పరిమితం కాలేదు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగింపును కూడా వ్యతిరేకించి భారత్‌ పట్ల వ్యతిరేకతను చాటుకున్నాడు.

సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ తరచూ కెనడాలో ఖలిస్థానీ రెఫరెండాలు కూడా నిర్వహిస్తోంది. జులైలో భారత దౌత్యవేత్తలకు, సిబ్బందికి వ్యక్తిగతంగా హానీ చేస్తామంటూ ఖలిస్థానీలు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ పరిస్థితిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. కెనడా ప్రభుత్వం మొక్కుబడిగా భద్రత కల్పించి వదిలేసింది.

అలాగే జూన్‌ లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులు కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. దీన్ని భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఖండించారు.

కెనడా వైశాల్యంపరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ–8లో దానికి సభ్యత్వం ఉంది. అలాగే అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమిలోనూ సభ్యత్వం ఉంది. జీ–20 దేశాల కూటమిలోనూ కెనడాకు సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈ దేశం భారత్‌ వ్యతిరేక శక్తులకు అండగా నిలవడంతో భారత్‌ పలుమార్లు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

2019 తర్వాత నుంచి జగ్మీత్‌ సింగ్‌ బృందం ఖలిస్థాన్‌ విషయంలో మరింత చురుగ్గా పనిచేస్తోంది. మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో భారత దౌత్య కార్యాలయాలు, ప్రజలు, హిందూ ఆలయాలపై ఖలిస్థానీల దాడులు పెచ్చరిల్లాయి. ముఖ్యంగా కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో ఇటీవల పలు ఘటనలు చోటు చేసుకొన్నాయి.

ఈ ఏడాది మార్చిలో లండన్‌ లోని భారత హైకమిషనర్‌ కార్యాలయంపై దాడి చేశారు. అంతేకాకుండా భారత పతాకాన్ని అవమానించారు. ఈ ఏడాది జులైలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ శివార్లలోని మేరీల్యాండ్‌ లో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ విద్యార్థులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు.

Tags:    

Similar News