కళా ఆశలను బాబు ఎలా తీరుస్తారో ?
రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. విభజన ఏపీకి తొలి టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ టీడీపీ నేతగా కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన 1983లోనే తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్రను సొంతం చేసుకున్నారు. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఆయనది. ఎన్నో మార్లు మంత్రిగా పనిచేసారు. హోం మంత్రిత్వ శాఖను చూసారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. విభజన ఏపీకి తొలి టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
ఇలా కళా ఎన్నో పదవులు నిర్వహించినా ఆయనకు ఇటీవల కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. జిల్లా కానీ జిల్లాకు వచ్చి పోటీ చేసి బొత్స సత్యనారాయణ వంటి ఉద్ధండుడుని మంత్రి హోదాలో ఉన్న వారిని కూడా ఓడించి గెలుచుకుని వచ్చిన కళాకు మంత్రి యోగం పట్టలేదు.
దాంతోనే ఆయన కొంత డీలా అయ్యారు. అయితే ఆయన అనుచరులు మాత్రం ఏపీ మంత్రి వర్గంలో మిగిలిన ఒకే ఒక ఖాళీ పోస్టు కళా కోసమే అని చెబుతున్నారు. కళా కూడా ఆ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ విస్తరణ ఆలస్యం అయితే ఈలోగా టీటీడీ చైర్మన్ పదవి అయినా తనకు దక్కుతుందని ఆయన భావిస్తున్నారుట.
తన లాంటి సీనియర్ కి చంద్రబాబు అన్యాయం చేయరని కూడా కళా ఆలోచిస్తున్నారుట. చిత్రమేంటి అంటే చీపురుపల్లిలో బొత్సను ఓడించి గెలిచి అధికార పార్టీలో ఉన్నా కళాకు ఏ పదవీ దక్కలేదు. అదే ఓటమి చెందిన బొత్సకు రెండు నెలలు తిరగకుండానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ ఏకంగా శాసనమండలిలో అపొజిషన్ లీడర్ ని చేశారు. దాంతో బొత్సకు కేబినెట్ హోదా దక్కింది. అదే బొత్సను భారీ ఓట్ల తేడాతో ఓడించి వచ్చిన కళా మాత్రం జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇది కూడా కళా అభిమానులలో అనుచరులలోనూ చర్చకు తావిస్తోంది.
కళా వంటి సీనియర్ సేవలను టీడీపీ ఉపయోగించుకోవాలని వారు కోరుతున్నారు. కళాకు మంత్రి పదవి అయినా లేక కేబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పదవి అయినా ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎన్నో కీలక పదవులు ఇచ్చిన చంద్రబాబు నామినేటెడ్ పదవులు మాత్రం టికెట్లు రాక త్యాగం చేసిన వారికీ ఏ పదవీ లేకుండా ఏళ్లకు ఏళ్ళు పార్టీ జెండా మోసిన వారికీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
దాంతో సీనియర్లకు చుక్కెదురే అని అంటున్నారు. అయితే కళా వర్గం మాత్రం కోటి ఆశలతో అధినాయకత్వం వైపు చూతోంది. బొత్స కొత్తగా వచ్చిన పదవితో చీపురుపల్లిలో మరింతగా దూకుడు చేస్తారని ఆయన్ని తట్టుకోవాలీ అంటే కళాకు కీలక పదవి ఇవ్వాల్సిందే అని అంటున్నారు. మరి బాబు కళా ఆశలను ఎలా తీరుస్తారో.