హాట్ టాపిక్... వైఎస్ షర్మిళ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?
అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు... అన్నట్లుగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పాదయాత్ర కూడా చేసి, తీరా ఎన్నికల సమయానికి అస్త్రసన్యాయం చేశారు.
కొన్ని ఊహించని పరిణామాలు, మరికొన్ని ఊహించిన పరిణామాల నడుమ తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు షాకిస్తూ వైఎస్ షర్మిళ "వైఎస్సార్టీపీ"ని మూసేశారు. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు... అన్నట్లుగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పాదయాత్ర కూడా చేసి, తీరా ఎన్నికల సమయానికి అస్త్రసన్యాయం చేశారు. తన ఆట కాంగ్రెస్ పార్టీ ఆడతాదని బ్యాట్ పక్కనపాడేశారు!! ఆనాక కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత.. తాను ఆడకపోవడం వల్లే గెలిచిందని చెప్పుకున్నారు!!
కట్ చేస్తే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. సోనియమ్మను ఆకాశనికెత్తారు.. రాహుల్ ని ప్రధానిని చేయడమే లక్ష్యమని తెలిపారు.. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఇబ్బందిపెట్టలేదని చెబుతున్నారు.. వైఎస్ బిడ్డగా చెబుతున్నా – వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది అని భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎఫ్.ఐ.ఆర్. లో వైఎస్సార్ పేరు చేర్చడం.. సోనియాకు తెలియకుండా జరిగిన పొరపాటని వెల్లడించారు!!
ఈ సమయంలో... తెలంగాణలో రాజన్న రాజ్యం బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించారో ఏమో... ఏపీలో వైఎస్సార్ ఆశయాల సాధన తన బాధ్యత అంటూ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు షర్మిల. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రుల ఆగ్రహం చవిచూసిన కాంగ్రెస్ ఇక్కడ వెంటిలేటర్ పై ఉన్న సంగతి తెలిసిందే. దీంతో... వెంటిలేటర్ పై ఉన్న పార్టీని ఒలెంపిక్స్ లో పరుగుపెట్టిస్తాను అన్న కాన్ ఫిడెన్స్ తో షర్మిళ రంగంలోకి దిగినట్లున్నారు.
ఈ సమయంలో వచ్చీరాగానే జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకసమయంలో... "జగన్ రెడ్డి" అంటూ సంభోదించారు కూడా! దీంతో... మనిషి ఎంత ఎత్తుకెళ్లినా సరే... పునాదులు మరిచిపోకూడదు అనే కామెంట్లు వినిపించాయి. ఈ సందర్భంగా జగన్ పై చేస్తున్న విమర్శలు సంగతి కాసేపు పక్కనపెడితే... వైఎస్ షర్మిళ ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయనేది ఇప్పుడు కీలక అంశంగా ఉంది.
అవి ఈ విధంగా ఉన్నాయి...
అసలు జగన్ తో ఎందుకు విభేదించాల్సి వచ్చింది?
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది?
ఏపీ వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది?
కాంగ్రెస్ ను చెడామడా తిట్టి ఇప్పుడు కీర్తించడాన్ని ఎలా చూడాలి?
మిమ్మల్ని ఏపీకి రేవంతి రెడ్డి వ్యూహాత్మకంగా మల్లించాడనే కామెంట్ కు సమాధానం?
వైఎస్ ఫ్యామిలీలోని మహిళలంతా ఖైరతాబాద్ సెంటర్ లో రోడ్డు ఫుట్ పాత్ పై అర్ధరాత్రి కూర్చోడానికి కారణం ఎవరు?
జగన్ ఏం అన్యాయం చేశారో స్పష్టంగా చెప్పగలరా?
ఓదార్పు యాత్ర చేయాలని జగన్ భావించడం నేరమా?
మీరు తెలంగాణలో ఉన్నప్పుడు మణిపూర్ అంశంపై ఎందుకు స్పందించలేదు?
ఏపీతో మాకేం సంబంధం అన్న మాటలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాయి?
ఇటువంటి ప్రశ్నలన్నింటికీ షర్మిళ ఆత్మసాక్షిగా, దైవ సాక్షిగా వాస్తవ సమధానాలు చెప్పి.. అప్పుడు ఏపీని ఉద్దరిస్తాననే మాటలు మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని.. అప్పటివరకూ ఏ స్థాయిలో కష్టపడినా కలిసొచ్చేది ఏమీ ఉండదని అంటున్నారు!!