తల నరికిన కేసులో బాలకృష్ణ ఫ్యాన్స్‌పై కేసు..!
డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సక్సెస్‌లతో జోరు మీద ఉన్నారు. ఎమ్మెల్యేగా మూడో సారి గెలవడంతో పాటు, హీరోగా వరుసగా నాలుగు సినిమాలతో సూపర్ హిట్ అందుకోవడంతో నందమూరి ఫ్యాన్స్‌లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అందుకే బాలకృష్ణ ఫ్యాన్స్ డాకు మహారాజ్ థియేటర్ల వద్ద చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సీడెడ్ ఏరియాలో బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకి అక్కడ వీరాభిమానులు ఉంటారు. అప్పట్లో బాలకృష్ణ కటౌట్‌కి గొర్రె పోతుల తలకాయలతో దండలు వేసేవారు అనే టాక్ ఉంది.
డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డాకు మహారాజ్ థియేటర్ వద్ద బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక గొర్రెపోతు తలను నరకడం, ఆ రక్తంతో బాలకృష్ణ కటౌట్‌కి రక్తాభిషేకం చేయడం తెలిసిందే. అభిమానులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. థియేటర్ వద్ద గొర్రె పోతు తల నరికిన కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందమూరి అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
సినిమా థియేటర్ వద్ద బహిరంగంగా జంతు హింసకు పాల్పడ్డ కారణంగా వారిపై కేసులు నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల వారు పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచికత్తు పై విడుదల చేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై బాలకృష్ణ ఎలా స్పందిస్తాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఆయన ఫ్యాన్స్‌ను ఈ విషయానికి అరెస్ట్ చేయడం కాస్త విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు వారి డ్యూటీని వారు చేశారు. జంతువులను అంత బహిరంగంగా నరకడం కచ్చితంగా తప్పే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ వరుసగా నాల్గవ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన డాకు మహారాజ్ సినిమాకు ఇప్పటికే వంద కోట్లకు మించిన వసూళ్లు నమోదు అయ్యాయి. బాలకృష్ణ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సినిమా నిలువబోతుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ విలన్‌గా నటించి మెప్పించారు. బాలకృష్ణ డాకు గెటప్‌లో గుర్రంపై వచ్చే సన్నివేశాలకు మంచి స్పందన దక్కింది.