బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు లోకేష్ పైన కేసు నమోదు !

ఈ కేసులో దర్యాప్తుని మొదలెట్టిన ఏపీ సీఐడీ దూకుడు చూపిస్తూ టీడీపీలో ఉన్న తండ్రీ కొడుకుల మీదనే కేసులు పెట్టడం విశేషం.

Update: 2024-05-05 09:49 GMT

ఏపీలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు లోకేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్న ఆరోపణలతో వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులతో రియాక్ట్ అయిన ఈసీ ఏపీ సీఐడీకి చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.

దాని పర్యవసానంగా ఏపీ సీఐడీ ఇరవై నాలుగు గంటల వ్యవధి కూడా లేకుండానే ఈ కేసులో ఏ వన్ గా టీడీపీ అధినేత చంద్రబాబుని, ఏ టూగా నారా లోకేష్ ని పేర్కొంటూ కేసు నమోదు చేయడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తుని మొదలెట్టిన ఏపీ సీఐడీ దూకుడు చూపిస్తూ టీడీపీలో ఉన్న తండ్రీ కొడుకుల మీదనే కేసులు పెట్టడం విశేషం.

ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ లో ఏ వన్ గా చంద్రబాబు ఉంటే ఏ టూ గా నారా లోకేష్ ఉన్నారు. టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు నేరుగా ఫోన్ ద్వారా సందేశాలను టీడీపీ పంపిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేయించిందన్నది వైసీపీ చేసిన ప్రధాన ఆరోపణగా ఉంది.

ఈ మేరకు వైసీపీ కీలక నేత మల్లది విష్ణు తదితరులు శనివారం ఈసీని కలసి ఫిర్యాదు చేశారు. దాంతో చంద్రబాబు లోకేష్ ల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేరుస్తూ ఏపీ సీఐడీ రంగంలోకి దిగిపోయింది. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రయత్నం చేస్తోందని, ప్రజలలో తీవ్ర అందోళన భయాలు కల్పించడం ద్వారా వైసీపీకి నష్టం చేకూర్చేందుకు కుట్ర చేస్తోంది అన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ.

ఇదిలా ఉంటే దేశ హోం మంత్రి అమిత్ షా తో కలసి చంద్రబాబు ధర్మవరం ఎన్నికల ప్రచార సభలో ఉన్నారు. ఆరేళ్ళ తరువాత ఒకే వేదిక మీద బాబు అమిత్ షాలు కలుసుకున్నారు. అలా అమిత్ షా పక్కన బాబు ఉన్న సమయంలో ఆయన మీద ఏ వన్ గా ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేయడం ద్వారా ఏపీ సీఐడీ సంచలనం రేపింది అని అంటున్నారు. ఇక్కడ బీజేపీ సమర్ధన మద్దతు ఎలా ఉంటాయన్నది కూడా చర్చకు వస్తోంది. తాము ప్రతిపాదించిన చట్టం మీద మిత్రపక్షంగా ఉన్న టీడీపీ విమర్శలు చేయడాన్ని సమర్ధించుకుని వైసీపీ ని తప్పు పడుతుందా లేదా మౌనం పాటిస్తుందా లేదా ఆ చట్టం మంచిదే అని ప్రజలకు క్లారిటీ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News