చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందినట్టు తెలిసింది. చంద్రబాబు చేస్తు న్న వ్యాఖ్యలపై సామాజిక ఉద్యమకారుడు ఒకరు.. తాజాగా ఈసీకి ఫిర్యాదు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. ముఖ్యంగా నెల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనే ఈ ఫిర్యాదు చేశారని అంటున్నారు. దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు దీనిని కేంద్ర సంఘానికి పంపే అవకాశం ఉందని సమాచారం.
ఏం జరిగింది?
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సహజంగా ఎన్నికలు అనగానే ఒకింత ఊపు ఉంటుంది. విమర్శలు, ప్రతివిమర్శలు కూడా కామన్‌గానే ఉంటాయి. కానీ, మాస్ జనాలను ఆకట్టుకునే ప్రయత్నమో.. లేక, వైసీపీ నాయకులను ఇలా విమర్శిస్తే .. తప్ప జనంలోకి వెళ్లదని అనుకుంటున్నారో తెలియదు కానీ.. మాజీ సీఎం చంద్రబాబు ఒకింత ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి.
తాజాగా సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ``ఇంటికొకరు.. కర్ర పట్టుకుని దొంగను తరిమి కొట్టినట్టు తరిమి కొట్టండి!`` అని నెల్లూరులో ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ను దొంగతో పోల్చారు. సహజంగానే ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర విమర్శలు వస్తున్నా.. ఇలా.. నేతలను దొంగలతో పోల్చడం ఇదే మొదలు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు.. వివాదంగా మారాయని తెలుస్తోంది. పైగా కోడ్ అమల్లో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని ఈసీ కూడా పేర్కొంది.
``నువ్వు చేసిన తప్పులకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు.(బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తులపై). మీ ఊర్లోకి దొంగ వస్తే ఇంటింటికీ ఒకరు కర్ర పట్టుకుని ఆ దొంగను తరుముతా రా లేదా? ఇక్కడ కులం, మతం చూసుకుంటారా? అదే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి! ఇంటి కొకరు కర్ర పట్టుకుని దొంగను తమిరినట్టు ఈ ముఖ్యమంత్రిని తరిమి కొట్టండి`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపైనే ఫిర్యాదు అందినట్టు సమాచారం.