రూల్స్ గీల్స్ జాన్తా నై... కోర్టు నిబంధనలు బాబు బేఖాతరు!?

మైక్ కనిపించగానే మాట్లాడొద్దు.. ప్రింట్ లేదా డిజిటల్ మీడియాతో సంభాషించొద్దు.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దు.. నవంబర్ 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మళ్ళీ సెంట్రల్ జైలుకి స్వచ్ఛందంగా వెళ్లి లొంగిపోవాలి..

Update: 2023-10-31 15:50 GMT

 ఆరోగ్య పరిస్థితిని గమనించి, మీకు కంటి చికిత్స అవసరాన్ని గుర్తించి నెలరోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నాం.. ఈ నెలరోజులు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. మైక్ కనిపించగానే మాట్లాడొద్దు.. ప్రింట్ లేదా డిజిటల్ మీడియాతో సంభాషించొద్దు.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దు.. నవంబర్ 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మళ్ళీ సెంట్రల్ జైలుకి స్వచ్ఛందంగా వెళ్లి లొంగిపోవాలి.. అని పలు షరతులు విధిస్తూ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


అయితే అలా జైలు నుంచి ఇలా బయటకు వచ్చిన వెంటనే బాబు యథేఛ్చగా వాటిని ఉల్లంఘించారనే చర్చ మొదలైపోయింది. జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన బాబు బయటకు రాగానే మైకందుకున్నారు. తాను తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పూ చేయలేదని, చేయనివ్వలేదని చెప్పుకున్నారు. దీంతో.. ఇది కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడమే అని, ఉన్నత న్యాయస్థానం విధించిన షరతులను తుంగలోకి తొక్కడమే అని అంటున్నారు !

అవును.. వ్యవస్ధను సృష్టించిందే నేనే, వ్యవస్థలను నడిపేదే నేను అనుకున్నారో ఏమో తెలియదు కానీ... రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి (ఆరోగ్య కారణాలతో లభించిన మధ్యంతర బెయిల్ వల్ల) విడుదల కాగానే చంద్రబాబు స్వోత్కర్ష మొదలు పెట్టారు! ఇందులో భాగంగా తాను ఏ తప్పూ చేయలేదు.. చేయనివ్వను అంటూ తన ఘనతను చెప్పుకునే ప్రయత్నం చేశారు! ఈ సందర్భంగా... తానూ జైల్లో ఉన్నపుడు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్, బీజేపీ, బీఆరెస్స్ నాయకులకు, కాంగ్రెస్ లోని కొందరు నేతలు ధన్యవాదాలు తెలిపారు.

దీంతో... నాలుగువారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు విధించిన నిబంధనలు అయన ఒక్కరోజులోనే ఉల్లంఘించారని, ఫలితంగా వ్యవస్థలపై తన తీరును వెల్లడించారని అంటున్నారు! ఇదే సమయంలో... తనను ఎవరేమి చేస్తారు అనే ధీమాతోనే అయన అలా చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా... ఈ నెలరోజుల్లో ఇంకెన్ని విధాలుగా తన దూకుడును బయటపెట్టి కోర్టులను, వాటి తీర్పులను అవహేళన చేస్తారో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా... కేసు మెరిట్స్ పై కాకుండా.. కేవలం ఆయన ఆరోగ్య పరిస్థితుల కారణంగానే మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎటువంటి రాజకీయ ర్యాలీలలోనూ పాల్గొనకూడదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదని తెలిపింది. ఈ నేపథ్యంలో... బాబు విడుదలైన తొలిరోజే తాను ఏ తప్పూ చేయలేదని, చేయనివ్వలేదని వ్యాఖ్యానించారు. దీంతో హైకోర్టు ఆదేశాలను బాబు తుంగలోకి తొక్కారని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News