కొట్టొచ్చినట్లుగా బాబులో మార్పు.. ఎండ వేళ గొడుగు నీడకు నో
గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కాస్తంత హడావుడి ఉండేది.
ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా (కచ్ఛితంగా పద్నాలుగున్నర ఏళ్లు) బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వేళ.. బాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు ఇప్పటికి ఏ మాత్రం పోలిక లేదంటున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రిగా ఎలాంటి దర్జాను ఆయన దర చేరనివ్వటం లేదు.
గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కాస్తంత హడావుడి ఉండేది. ఈసారి మాత్రం ఆయనలో మార్పు చాలా ఎక్కువగా ఉందన్న అభిప్రాయాన్నిఆయన సన్నిహితులు సైతం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో తాను పర్యటించే వేళలో ఎలాంటి హడావుడి.. ఆడంబరాలు వద్దని స్పష్టం చేస్తున్న చంద్రబాబు.. గత ప్రభుత్వంలో మాదిరి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరదాలు కట్టేయాన్ని తప్పు పట్టటం తెలిసిందే. అలాంటి ఏర్పాట్లు చేస్తే సదరు అధికారులపై చర్యలు ఖాయమని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.
తాజాగా విశాఖ పర్యటన సందర్భంగా బాబు తీరు అందరిని ఆకర్షిస్తోంది. ఎర్రటి ఎండలో నిలుచున్న ఆయనకు గొడుగు పట్టేందుకు ఏర్పాటు చేయగా.. తనకు గొడుగు నీడ అవసరం లేదని స్పష్టం చేస్తూ నో చెప్పారు. సాధారణంగా చంద్రబాబు వయసులో ఉన్న వారెవరూ ఎండకు తాళలేరు. అందునా సీఎంగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తల్లో భాగంగా ఇలాంటివి కాదనరు.కానీ.. చంద్రబాబు మాత్రం నో చెప్పటమే కాదు.. సేవకుడిగా వచ్చా.. రాజును కాదంటూ వ్యాఖ్యానించారు. అంటేకాదు.. తనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటుచేసిన రెడ్ కార్పెట్ ను సైతం నో చెప్పిన ఆయన.. ఇకపై ఎవరైనా తనకు రెడ్ కార్పెట్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడికి చేరుకున్న వేళ.. ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా చేయటమే కాదు.. ఇరుకు రహదారుల్లో ముఖ్యమంత్రి పర్యటించే వేళలో.. మిగిలిన అన్ని వాహనాల్ని అనుమతించటం గమనార్హం. చంద్రబాబును కలిసేందుకు కొందరు కార్యకర్తలు ప్రయత్నించటం.. వారిని పోలీసులు అడ్డుకోవటం చూసిన ఆయన.. లీడర్లపై అరవొద్దు.. వారిని పంపండంటూ చెబుతూ తన దగ్గరకు పిలవటం లాంటి చర్యల్ని చూసిన వారు చంద్రబాబులో చాలా మార్పు వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.