బాబు పదే పదే అంటున్నది అందుకోసమేనా ?

ఏపీలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అంటున్నారు.

Update: 2024-07-12 06:30 GMT

ఏపీలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అంటున్నారు. నిజానికి ఈ కూటమిలో అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి. చెప్పుకోవాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఇది అని మీడియా ముందు అలాగే బహిరంగ సభలలోనూ చంద్రబాబు ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. దాని అర్ధం పరమార్ధం ఏంటి అంటే ఎన్డీయే ప్రభుత్వం కాబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని అని అంటున్నారు.

కేంద్రం ఉదారంగా ఏపీకి ఆర్ధికంగా సాయం చేసి ఆదుకోవాలని కూడా అంటున్నారు. ఇక విశాఖ జిల్లా పర్యటనలో చంద్రబాబు ఒక మాట చెప్పారు. ఏపీ మొత్తం దివాళా తీసింది అని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగు లేదు అని కూడా చెప్పారు. తనకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఏపీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాను అని కూడా చంద్రబాబు చెప్పారు.

అదే సమయంలో ఆర్ధికంగా ఏపీ ఏమీ బాగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అయిదేళ్ళ పాటు సాగిన వైసీపీ ప్రభుత్వం పాలనలో ఏపీ అన్ని విధాలుగా చితికిపోయిందని ఆయన అన్నారు. ఆదాయ వనరులు లేవని అన్నారు. ఎటు చూసినా సమస్యలే ఉన్నాయని అన్నారు.

తమ కూటమికి ప్రజలు ఎంతో నమ్మి గెలిపించారని, అత్యధిక సీట్లు కట్టబెట్టారని అందువల్ల బాధ్యతగా తాము పనిచేస్తామని తనకు ప్రజల రుణం తీర్చుకోవాలని ఉందని బాబు అన్నారు. అందుకే తాను సీఎం గా ప్రమాణం చేసిన వెంటనే కేంద్రం వద్దకు వెళ్లి ఏపీని ఆదుకోవాలని కోరాను అని బాబు చెప్పారు. ఏపీలో ఆర్థికంగా అన్నీ దివాళా తీశాయని కూడా ప్రధాని మోడీకి వివరించాను అని బాబు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకుంటేనే అభివృద్ధి సాధ్యమని బాబు అన్నారు. మరో వైపు చూస్తే తాను వస్తున్న దారులల్లో రహదారులకు గుంటలు గొయ్యిలు కనిపించాయని వాటిని ఏమి చేయాలని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ఆ విధంగా రోడ్లను తయారు చేసిన వైసీపీ నేతలనే ఆ గొయ్యిలలో కూర్చోబెట్టేయాలని ఆయన సెటైర్లు వేశారు. అంతే తప్ప రోడ్లను బాగు చేయించేందుకు కార్యాచరణ అని చెప్పలేకపోయారు.

దానికి కారణం ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నపుడు ఒక హుషార్ తో మాట్లాడేవారు. ఈసారి మాత్రం ఆయన భారంగా బాధ్యతను మోస్తున్న తీరుతోనే ఉంటున్నారు. ఎన్నో హామీలు ఉన్నాయి. అలాగే అయిదేళ్లుగా అభివృద్ధి లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. లక్షల కోట్ల ఖర్చు ఉంది. చూస్తూండగానే నెల తిరిగిపోతే సామాజిక పెన్షన్లు ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ పెన్షనర్ల పించన్లు ఇలా ఏకంగా పది నుంచి పన్నెండు వేల పై చిలుకు ఖర్చు కనిపిస్తుంది. ఇదంతా ఒకటో తేదీగా తీసి ఖర్చు పెట్టాలి.

ఇక అభివృద్ధి ప్రాజెక్టుల తీరు చూస్తే అమరావతి లక్షల కోట్ల ప్రాజెక్ట్ గా ఉంది. పోలవరం ఎనభై వేల కోట్ల అంచనాతో ఉంది. రోడ్ల బాగు కోసం పది వేల కోట్లు తీసి ఖర్చు చేయాలి. ఇలా ఏది ముట్టుకున్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం గానే ఉంది. అందుకే ఎన్డీయే ప్రభుత్వం అని బాబు ఏ మాత్రం బేషజం లేకుండానే చెబుతున్నారు. కేంద్ర పెద్దలకు బాధ్యతను గుర్తు చేస్తున్నారు. కేంద్రం ఆదుకుంటునే ఏపీ అభివృద్ధి సాధించేది అన్నది బాబుకు బాగా తెలుసు.

అందుకే ఆయన ప్రత్యేక హోదా వంటి డిమాండ్లు పెట్టడం లేదు, కేంద్రం ఆర్ధికంగా ఎంత ఎక్కువ నిధులు ఇస్తే అంతలా తెచ్చుకుని ఏపీని ఒక గాడిలో పెట్టాలని చూస్తున్నారు. మరి కేంద్రం అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎన్నికల ముందు చెప్పింది. అనుకున్నట్లుగా ఏపీలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటు అయింది.దానికి అవసరం అయిన నిధులు కేంద్రం ఇస్తుందా అభివృద్ధిలో ఏపీని ముందు వరసలో నిలబెట్టేందుకు చొరవ తీసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News