ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని బాబు ఆవేదన!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు, స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-22 07:19 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు, స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. మొత్తం 16 సభల్లో తొమ్మిది శాసనసభలను చూశానని.. అయితే గత 15వ శాసనసభలాంటిదాన్ని ఎన్నడూ చూడలేదన్నారు.

గత ప్రభుత్వం శాసనసభలో అరాచకంగా వ్యవహరించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విధానాలపై ప్రశ్నిస్తే బూతులు తిట్టడం, వెక్కిరించడం, అవహేళన చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం వంటి పనులు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో లేని, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తన భార్యను అవమానించారని చంద్రబాబు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.

తన గురించి, తన కుటుంబం గురించి గత శాసనసభలో వైసీపీ సభ్యులు నీచంగా మాట్లాడారని చంద్రబాబు గుర్తు చేశారు. వారిపైన నాటి సీఎం యాక్షన్‌ తీసుకోలేదన్నారు. వైసీపీ నేతలు తన సతీమణి గురించే కాకుండా రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ ఇలాగే నీచంగా మాట్లాడారన్నారు. సోషల్‌ మీడియాలోనూ దారుణమైన పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేల మాటలు తట్టుకోలేక తాను శాసన సభ నుంచి బయటకొచ్చాక కన్నీళ్లు పెట్టుకున్నానని ఆ బాధాకర సందర్భాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

శాసనసభ సాక్షిగా తన భార్యను అవమానిస్తుంటే తాను మాట్లాడటానికి మైకు అడిగినా ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి సభ నుంచి వాకౌట్‌ చేశానన్నారు. ‘ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ’ అని.. ‘మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే ఈ శాసనసభలో అడుగుపెడతా’నని శపథం చేశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాడు అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలను చదివి వినిపించారు.

ప్రజలు ఆశీర్వాదంతో కూటమి గెలిచిందని.. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రజల వల్లే తాను మళ్లీ ముఖ్యమంత్రిగా శాసనసభకు రాగలిగానని చంద్రబాబు వివరించారు. ప్రస్తుత శాసనసభలో ఎవరూ కూడా గతంలో వైసీపీ సభ్యులు వ్యవహరించినట్టు బూతులు, వ్యక్తిగత దూషణలు, వెకిలి చేష్టలు, ఎక్కిరింతలు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డవద్దని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు.

ప్రజలు తమపై బాధ్యత పెట్టారని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాజధాని నిర్మించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం చేపట్టాలని ప్రజలు తమను గెలిపించారని చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఉద్భోదించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోగమనంలో కాకుండా తిరోగమనంలో నడిపిందన్నారు.

భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుడతానని.. తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలన్నదే తన కోరిక అని చంద్రబాబు తెలిపారు. 15వ శాసనసభ కౌరవ సభ అని.. 16వ సభ గౌరవ సభగా ఉండేలా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News