ఆ నలుగురిని అనుమతించాల్సిందే.. సీఐడీకి చంద్రబాబు లేఖ!
తన తరఫున న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మీనారాయణ, జవ్వాజి శరత్ చంద్రను కలిసేందుకు అనుమతివ్వాలని లేఖలో కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అక్కడి నుంచి కాన్వాయ్ లో గుంటూరు జిల్లాలోని కుంచనపల్లికి తరలించారు. అక్కడ ఏపీ సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ప్రధానంగా 20 ప్రశ్నలను సిద్ధం చేసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని అంటున్నారు. ఈ స్కామ్ తో తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు.. సీమెన్స్ కంపెనీ ప్రతినిధులకు, చంద్రబాబుకు జరిగిన వాట్సాప్ చాటింగ్ కు సంబంధించిన ఆధారాలను ఆయనకు చూపారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాము సిద్ధం చేసుకున్న 20 ప్రశ్నలకు ఆయన ముందు పెట్టి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
కాగా ప్రభుత్వ న్యాయవాదులను సీఐడీ కార్యాలయంలోకి అనుమతించిన అధికారులు చంద్రబాబు తరఫున న్యాయవాదులను లోపలకు అనుమతించకపోవడంపై వివాదం నెలకొంది. ఉదయం అరెస్టు నుంచి ఇప్పటివరకు సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులను సీఐడీ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాదులను అనుమతించి.. చంద్రబాబు లాయర్లను నిలిపివేయడంపై మండిపడ్డారు. చంద్రబాబు తరఫు అడ్వొకేట్లను ఏ నిబంధనల ప్రకారం ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
మరో వైపు తన న్యాయవాదులను కలిసేందుకు అనుమతించాలని చంద్రబాబు సీఐడీ అధికారులకు లేఖ రాశారు. తన తరఫున న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మీనారాయణ, జవ్వాజి శరత్ చంద్రను కలిసేందుకు అనుమతివ్వాలని లేఖలో కోరారు.
మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడ చేరుకున్నారు. ఆయన కోర్టు వద్ద చంద్రబాబు తరఫున వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు.
సీఐడీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబును ప్రశ్నించాక ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తారని చెబుతున్నారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారని అంటున్నారు.
ఇంకోవైపు చంద్రబాబును చూసేందుకు టీడీపీ నేతలు, శ్రేణులు భారీగా తరలిరావడంతో విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తామని సీఐడీ అధికారులు ప్రకటించినప్పటికీ .. ఆయన్ను సీఐడీ కార్యాలయంలోనే ఉంచడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
చంద్రబాబు అరెస్టు సమయంలో ఆధారాలు ఇవ్వమంటే అన్నీ కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పిన సీఐడీ అధికారులు.. ఇప్పుడు ఆయన్ను కోర్టులో హాజరు పర్చకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు.