లైవ్ అప్ డేట్స్... చంద్రబాబు పిటిషన్ల తాజా పరిస్థితి ఇది!

ఈ క్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి సీఐడీ కస్టడీ, చంద్రబాబు బెయిల్ పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

Update: 2023-09-27 12:10 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరోపక్క అటు ఏసీబీ కోర్టు, హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ బాబు న్యాయవాదులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. మరోపక్క సీఐడీ కూడా పీటీ వారెంట్లు, కస్టడీ వారెంట్లూ జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సమయానికి ఏ కోర్టులో ఏ పిటిషన్ పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

అవును... ప్రస్తుతం ఇటు ఏసీబీ కోర్టు, హైకోర్టు, అటు సుప్రీంకోర్టులు చంద్రబాబు తరుపు న్యాయవాదులతో సందడిగా నెలకొందని అంటున్నారు. ఈ క్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి సీఐడీ కస్టడీ, చంద్రబాబు బెయిల్ పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇందులో భాగంగా అక్టోబరు 4కు వాయిదా వేసి.. అదే రోజు రెండు పిటిషన్లనూ కలిపి విచారిస్తామని తెలిపింది.

ఇదే సమయంలో అదే రోజున రెండు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి... మరోసారి వాదనాలు వేయవద్దని చంద్రబాబు లాయర్లకు సూచించారు. అదేవిధంగా ఆ రోజు ఎవరు వాదనలు చెప్పకపోయినా ఆర్డర్ పాస్ చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదంటూ బాబు లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం!

దీంతో... స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించిన బాబు కోరుతున్న బెయిల్, సీఐడీ కొరుతున్న 5 రోజుల కస్టడీకి సంబంధించిన కీలక విచారణలు వచ్చే నెల 4న ఏసీబీ కోర్టులో జరగనున్నాయన్నమాట. ఇదే సమయంలో అమరావతి రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కూడా అక్టోబర్‌ 4నే విచారణ జరగనుంది.

ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసుకు సంబంధించి విచారణ ఏపీ హైకోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆ రోజు మద్యాహ్నం 2:15 గంటలకు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో తాజాగా లోకేష్ ను ఏ14గా ఏపీ సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే గత 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న లోకేష్ ఎల్లుండు రాత్రి నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారు! ఈ సమయంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసులో ఏ14 గా చేర్చడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇదే సమయంలో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. క్వాష్‌ పిటిషన్‌ పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా... స్కిల్ స్కాం కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News