టీడీపీలో సెలబ్రేషన్ మూడ్.. ..దేనికి సంకేతం...?

ఎన్నికలు లేవు, ఆ హడావుడి లేదు, కానీ తెలుగుదేశం మాత్రం సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. ఎన్నికలు లాంచనం అనుకుంటున్నారు తమ్ముళ్ళు.

Update: 2023-08-13 03:54 GMT

ఎన్నికలు లేవు, ఆ హడావుడి లేదు, కానీ తెలుగుదేశం మాత్రం సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. ఎన్నికలు లాంచనం అనుకుంటున్నారు తమ్ముళ్ళు. చాలా మంది ఆత్రంతో ఉన్న వారు మంత్రి వర్గ శాఖల దాకా కూడా మాట్లాడుకుంటున్నారు. పసుపు పార్టీలో ఇదంతా పరవశంతో కూడిన సందర్భంగా ఉంది.

ఇంతకీ తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఇంతటి ఆనందం అంటే. ఏపీలో వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీకి ఒక్క చాన్సే జనాలు ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా చంద్రబాబు ఆయన టీడీపీ ఉన్నారు. పైగా జనసేనతో పొత్తులు ఉండొచ్చు. వాతావరణం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి ఇక గెలుపు మనదే అన్న అతి ధీమా అయితే తమ్ముళ్లలో ఉంది అని అంటున్నారు.

ఇది మంచిదేనా అంటే కానే కాదు అన్నది పార్టీలో ఎన్నో యుద్ధాలను చూసిన సీనియర్ల భావన. హితైషుల సూచన కూడా. అయితే టీడీపీ మాత్రం గెలుపు ఖాయం అన్న పెద్ద నమ్మకంతో ఉంది. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. గత ఏడాది నుంచి టీడీపీ గ్రాఫ్ మెల్లగా పెరగడం మొదలైంది. బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు జిల్లాల టూర్లు పెట్టుకుంటే జనాలు వెల్లువలా వచ్చారు. ఆ తరువాత ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అని మరో ప్రోగ్రాం పెడితే దానికి విరగబడ్డారు.

ఇక ఈ ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు టీడీపీ కొట్టేసింది. అంతే కాదు సీమ జిల్లాలలో రెండూ గెలిచి తన ఖాతాలో వేసుకుంది. ఇక లోకేష్ గత ఆరేడు నెలలుగా జనంలో ఉంటూ చేస్తున్న యువగళం పాదయాత్రకు కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు. ఇటీవల చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల మీద చేపట్టిన కార్యక్రమాలకు సైతం జనాలు బాగానే వచ్చారు. రెస్పాన్స్ బాగుంది అని ఫీడ్ బ్యాక్ అందుతోంది.

దాంతో తమ్ముళ్ళు అంతా ఇంకేముంది గెలిచేశామని సంబరాలలో మునిగి తేలుతున్నారు. అయితే అసలైనది గ్రౌండ్ లెవెల్ లో వర్క్. పార్టీని బూత్ లెవెల్ నుంచి పటిష్టం చేసుకుంటూ అందరినీ ఒక్కటిగా సమరోన్ముఖులను చేయడం. ఆ విషయం తీసుకుంటే టీడీపీలో చాలా మంది నాయకులు ఇంకా అలా కాడె వదిలేసే ఉన్నారు. చంద్రబాబు లోకేష్ బాబు తిరుగుతున్నారు కాబట్టి విజయం ఖాయమని ధీమా పడుతున్నారు.

అయితే ఎన్నికల్లో ఇలాంటి ధీమాలే కొంప ముంచుతాయని అంటున్నారు. వైసీపీని తీసివేయడానికి లేదని అంటున్నారు. అందువల్ల అంతా జనంలో ఉండాల్సిన అవసరం ఉంది, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రతీ ఒక్కరూ కార్యక్రమాలు నిర్వహించి జనంలో ఉండాల్సి ఉందని అంటున్నారు. కానీ తమ్ముళ్లలో అతి ధీమా కనిపిస్తోంది. ఇది జోష్ గా ఉంటే ఫరవాలేదు కానీ అది కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం బొక్క బోర్లా పడడం ఖాయమని కూడా చాలా మంది హెచ్చరిస్తున్నారు. మరి తమ్ముళ్ళలో ధీమా పార్టీకి ఆక్సిజనా లేక స్పీడ్ బ్రేకర్లా అన్నదే ఇపుడు చర్చగా మారింది.

Tags:    

Similar News