ఏపీకి వెళ్లే విషయంలో టీఎస్ లోని ఐఏఎస్ లకు కేంద్రం కీలక ఆదేశాలు!

తమను తెలంగాణలోనే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

Update: 2024-10-10 15:48 GMT

తమను తెలంగాణలోనే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ కేడర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... తెలంగాణలో ఉన్న ఏపీ కేడర్ ఐఏఎస్ లు ఏపీకి వెళ్లాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.

అవును... ఐఏఎస్ అధికారులు రొనాడ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, అమ్రపాలి, మల్లెల ప్రశాంతి తోపాటు.. ఐపీఎస్ అధికారులు అభిషేక్ మొహంతి, అంజనీ కుమార్ తదితరులు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే వారి అభ్యర్ధనను, అభ్యంతరాలను కేంద్రం తోసి పుచ్చింది!

ఇందులో భాగంగా... వారందరినీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ లను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోట్పీటీ) తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది. ఈ నేపథ్యంలో... ఈ నెల 16లోగా వీరందరినీ ఏపీలో చేరాలని ఆదేశించింది.

వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారులను ఏపీ, తెలంగాణలకు కేంద్రం సర్దుబాటు చేసింది. అయితే... వారిలో కొంతమంది మాత్రం పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ.. పలు కారణాలను చూపిస్తూ.. తమను తెలంగాణకు మార్చాలని కోరారు. ఇదే సమయంలో క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ వీరికి అనుకూలంగా తీర్పిచ్చింది.

అయితే... క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీరి అభ్యర్థననలు మరిశీలించిన కేంద్రం... తాజాగా వాటిని తోసిపుచ్చుతూ తాజా నిర్ణయం తీసుకుంది!

దీంతో ఈ నెల 16వ తేదీ లోగా పైన చెప్పుకున్న ఐదుగురు ఐఏఎస్ లు, ముగ్గురు ఐపీఎస్ లు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఊంటుంది!

Tags:    

Similar News