ఏం జరిగితే ఈ 8 మంది ఐఏఎస్/ఐపీఎస్ లు తెలంగాణలో ఉంటారు?

ఐపీఎస్ లు తెలంగాణలోనే కొనసాగుతున్న 8 మంది వెంటనే ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.

Update: 2024-10-11 04:27 GMT

విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించిన ఐఏఎస్.. ఐపీఎస్ లు తెలంగాణలోనే కొనసాగుతున్న 8 మంది వెంటనే ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. అదే సమయంలో తెలంగాణకు కేటాయించినప్పటికీ ఏపీలోనే ఉన్న ఐఏఎస్ లను తెలంగాణకు వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వును డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) కార్యదర్శి తాజాగా ఆదేశాలు జారీ చేయటంతో.. ఈ నెల 15 నాటికి వారి స్థానాలకు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

తాజా ఆదేశాల ప్రకారం తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్ లు (వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, అమ్రపాలి, ప్రశాంతి) ముగ్గురు ఐపీఎస్ లు (అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి) ఉన్నారు. అదే సమయంలో ఏపీలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ (స్రజన, శివశంకర్, హరికిరణ్)లు తక్షణమే తెలంగాణలో రిపోర్టు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు వీలుగా దరఖాస్తు పెట్టుకున్న ఎస్.ఎస్. రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ రిజెక్టు చేసింది. దీంతో వీరు ఏపీలోనే కొనసాగాల్సిన పరిస్థితి.

డీపీవోటీ ఆదేశించిన నేపథ్యంలో నిర్ణీత గడువు లోపు వెళ్లి రిపోర్టు చేయక తప్పని పరిస్థితి. ఇలాంటి వేళ.. వీరు ఎప్పటిలానే వారి వారిస్థానాల్లో ఉండాలంటే ఏం జరగాలి? అన్నది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాకుంటే.. డీవోపీటో ఆదేశాలను అనుసరించి.. తెలంగాణ వారు ఏపీకి, అదే సమయంలో ఏపీకి చెందిన వారు తెలంగాణకు వచ్చి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక విచక్షణాధికారంతో తమకు సదరు ఐఏఎస్, ఐపీఎస్ లను కేటాయించాల్సిందిగా సంబంధిత రాష్ట్రాన్ని.. కేంద్రాన్ని కోరాల్సి ఉంటుంది. ఇందుకు సదరు రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా ఓకే చేస్తే డిప్యుటేషన్ మీద వెళ్లేందుకు అనుమతిస్తారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి ఆ అవకాశం ఉండే వీల్లేదు. ఏదైనా ప్రత్యేకంగా ఒకరిద్దరు అధికారులకు అవకాశం ఉండే వీలుంది. అయితే.. మొదట మాత్రం డీవోపీటీ చెప్పినట్లుగా రిపోర్టు చేసిన కొన్ని రోజుల తర్వాత మాత్రమే వారు కోరుకున్న రాష్ట్రానికి వచ్చే వీలుంది. అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారమే. డీవోపీటీ ఆదేశించినట్లుగా మాత్రం తక్షణం వారికి కేటాయించిన రాష్ట్రానికి మాత్రం వెళ్లటం తప్పనిసరి.

Tags:    

Similar News