ప్రత్యేక హోదా...కేంద్రం తేల్చేసిందిలా !
ప్రత్యేక హోదా కోసం దేశంలో కొన్ని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. అందులో చూస్తే విభజన తరువాత అన్ని విధాలా దెబ్బ తిన్న ఏపీ మొదటి స్థానంలో ఉంది
ప్రత్యేక హోదా కోసం దేశంలో కొన్ని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. అందులో చూస్తే విభజన తరువాత అన్ని విధాలా దెబ్బ తిన్న ఏపీ మొదటి స్థానంలో ఉంది. పైగా ఏపీని విడగొడుతున్నపుడు ప్రత్యేక హోదా అన్న డిమాండ్ ని చేసింది అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీనే.
ఆ మీదట యూపీఏ ప్రభుత్వం ముందుకు వచ్చి అయిదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా అని ప్రకటిస్తే దానికి పదిహేనేళ్ళు చేయమని కోరింది కూడా బీజేపీనే. 2014 ఎన్నికల వేళ బీజేపీ గెలిస్తే ప్రత్యేక హోదా వస్తుందని కూడా ప్రచారం చేశారు.
అయితే ఇప్పటికి మూడు సార్లు గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మాత్రం ప్రత్యేక హోదా అంటే కాదు కూడదు అనే చెబుతూ వస్తోంది. నీతి అయోగ్ ప్రత్యేక హోదా అన్నది లేదని చెప్పిందని కొన్నాళ్ళ పాటు ప్రచారం చేశారు. అయితే ఇపుడు మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కారణం అయిన జేడీయూ ఎంపీ ఒకరు ప్రత్యేక హోదా బీహార్ రాష్ట్రానికి ఇవ్వమని కోరారు.
బీహార్ ఝంఝార్‌పూర్‌కు చెందిన జేడీయూ సభ్యుడు రామ్‌ప్రీత్ మండల్ ప్రత్యేక హోదా కల్పించే విషయంపై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తన ప్రశ్నను సంధించారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఏమేమి చర్యలు తీసుకున్నారంటూ ఆయన ఒక లిఖితపూర్వక ప్రశ్నను సంధించారు.
దానికి ఆయనకు లిఖితపూర్వకమైన జవాబు కేంద్రం నుంచి వచ్చింది. ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానంలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేశారు. . దానికి ఎన్డీసీ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని చెప్పారు. ఈ ఎండీసీ నిబంధనలు ఏమిటి అన్నది అంటే చాలానే అని అంటున్నారు.
ఒక రాష్ట్రానికి కానీ ప్రాంతాన్ని కానీ ప్రత్యేక కేటగీరి స్టేటస్ ఇచ్చి గుర్తించాలి అంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందులో మొదటిది కొండలు, క్లిష్టమైన భూభాగం ఉన్న ప్రాంతాలు ఉండాలిట. ఇక రెండవది చూస్తే తక్కువ జనాభా లేదా అత్యధిక గిరిజన జనాభా ఉండాలిట. మూడవది చూస్తే కనుక పొరుగు దేశాలతో సరిహద్దు కలిగిన వ్యూహాత్మక ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలుగా నిర్దేశించారు. నాలుగవది ఏంటంటే ఆర్థిక, మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రాలు అని నిర్వచించారు. అయిదవది చూస్తే కనుక అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలుగా పేర్కొనారు.
ఈ రాష్ట్రాలే ప్రత్యేక హోదా అర్హులు అంటూ తాజాగా కేంద్రం చెప్పింది. అంతే కాదు 2012లోనే ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బీహార్‌కు ప్రత్యేక హోదాను పరిశీలించిందని అయితే ఎన్డీసీ నిర్దేశించిన ప్రమాణాలలో బీహార్ అర్హత సాధించలేకపోయిందని పేర్కొన్నారు.
మరి దీనిని బట్టి చూస్తే బీహార్ మాత్రమే కాదు ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అంటున్నారు. ఏపీ కూడా పై నిబంధనలు పూర్తిగా కలిగి ఉన్నది కాదు. దాంతో బీహార్ కి ముఖం మీద చెప్పి ఏపీకి చెప్పకుండానే జవాబు వెతుక్కో మన్నట్లు గా కేంద్ర వైఖరి ఉందని అంటున్నారు.
అయితే ఇక్కడ మరో డౌట్ అందరికీ వస్తుంది. అదేంటి అంటే 2014 నుంచి ఇటీవల దాకా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెబుతూ వచ్చారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇక మీదట ఏ రాష్ట్రానికి ఇవ్వవద్దు అని చెప్పింది అని చెబుతూ వచ్చారు. ఇపుడు ఏకంగా నిబంధనలను ముందుకు తెచ్చారు.
మరి ఈ నిబంధనలు అన్నీ ఉన్నపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో ఎలా చెప్పారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతే కాదు ఆనాడు అధికార కాంగ్రెస్ విపక్ష బీజేపీ రెండూ కలసి ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని కూడా ఊదరగొట్టాయి. ఈ రోజుకీ కాంగ్రెస్ తాను అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అంటోంది. అదెలా సాధ్యమని కూడా అనేక మంది సందేహ పడుతున్నారు. ఇంకో వైపు చూస్తే నిబంధనలు ఎలా ఉన్నా రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నపుడు విచక్షణాధికారంతో ఉదారంగా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించవచ్చు అని మేధావులు అంటున్నారు.
ఉమ్మడి ఏపీని విభజించి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని, ఆ ఒక్క పాయింట్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సరిపోతుందని వాదించే వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కేంద్రం ప్రత్యేక హోదాపైన తేల్చేసినట్లే అని అంతా అంటున్నారు.