కలెక్టర్‌ గా పవర్‌ ఫుల్‌ లేడీ.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-07-03 09:37 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ గా చదలవాడ నాగరాణికి ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశమిచ్చారు.

ఈ చదలవాడ నాగరాణి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. గుంటూరు జిల్లాకు చెందిన ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌ చంద్ర సతీమణే ఈమె. ఉమేశ్‌ చంద్ర వివిధ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. రాయలసీమ జిల్లాల్లో 1990వ దశకంలో ఫ్యాక్షనిస్టులను అణచివేశారు. ఉమేశ్‌ చంద్ర పేరు చెబితే కొమ్ములు తిరిగిన ఫ్యాక్షనిస్టులు కూడా వణికిపోయేవారని అంటారు. అలాగే నక్సలైట్లనూ కూడా ఆయన ఏరిపారేశారు. దీంతో ఆయన నక్సల్స్‌ హిట్‌ లిస్టులో చేరారు.

ఈ క్రమంలో 1999లో హైదరాబాద్‌ లోని ఎస్సార్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద కారులో వెళ్తుండగా నలుగురు నక్సలైట్లు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఉమేశ్‌ చంద్ర గన్‌ మెన్‌ తోపాటు డ్రైవర్‌ మరణించారు. కారు దిగిన ఉమేశ్‌ చంద్ర నక్సల్స్‌ ను వెంబడించారు. అయితే ఆయన వద్ద రివాల్వర్‌ లేదని గ్రహించిన నక్సల్స్‌ ఆయనను కాల్చిచంపారు.

ఈ నేపథ్యంలోనే అప్పట్లో హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌ జంక్షన్‌ లో ఐపీఎస్‌ ఉమేశ్‌ చంద్ర నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. అది ఇప్పటికీ ఉంది.

Read more!

ఇక 1999లో ఉమేశ్‌ చంద్ర మరణించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. దీంతో ఉమేశ్‌ చంద్ర సతీమణి చదలవాడ నాగరాణికి కారుణ్య నియామకంలో భాగంగా ఆర్డీవో (డిప్యూటీ కలెక్టర్‌) పోస్టును ఇచ్చారు.

1999 నుంచి నాగరాణి ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో డైరెక్టర్‌ గా పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆమె సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ గా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమెకు కలెక్టర్‌ యోగం పట్టింది. నాగరాణిని తాజా ఐఏఎస్‌ బదిలీల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ గా నియమించారు. దీంతో ఆమె తొలిసారి కలెక్టర్‌ కాబోతున్నారు.

దీంతో ఎస్పీగా ఉన్నప్పుడు ఉమేశ్‌ చంద్ర ఎంత నిజాయితీగా పనిచేశారో.. రౌడీలను, ఫ్యాక్షనిస్టులను, నక్సలైట్లను ఎలా అణిచివేశారో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అంతే నిజాయితీగా నాగరాణి కూడా కలెక్టర్‌ గా పేద ప్రజలకు అండగా ఉండాలని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News

eac