ఈ వయసులోనూ చురుకు.. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల వెనుక 92 ఏళ్ల సీనియర్ నేత
తెలంగాణలో రాజకీయాలు మహా వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ ఇలా వచ్చారో లేదో
తెలంగాణలో రాజకీయాలు మహా వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ ఇలా వచ్చారో లేదో.. కేవలం ఐదు నిమిషాల్లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. వీరిలో ఒకరిద్దరు పార్టీ మారతారనే ప్రచారం జరిగినా, ఖండించడమో, మౌనంగా ఉండడమో చేశారు. ఇప్పుడు మాత్రం మరో నలుగురిని కూడగట్టుకుని ఏకంగా హస్తం గూటికి చేరారు. అయితే, వీరి చేరిక సందర్భంగా ఓ అరుదైన సీన్ కనిపించింది.
వారి వెనుక ఆయన
రామసహాయం సురేందర్ రెడ్డి.. ఇప్పటి తరానికి పూర్తిగా తెలియకపోవచ్చు గానీ.. 30 ఏళ్ల కిందటనే ఉమ్మడి ఏపీలో పెద్ద నాయకుడు. డోర్నకల్ దొరగా ఆయనకు మారు పేరు. 1962 నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మహబూబాబాద్ నుంచి తొలిసారి, తర్వాత నాలుగుసార్లు డోర్నకల్ నుంచి నెగ్గారు. ఎన్టీఆర్ హవాలోనూ కాంగ్రెస్ తరఫున గెలిచిన కొద్దిమంది నాయకుల్లో ఈయన ఒకరు. వరంగల్ నుంచి రెండుసార్లు ఎంపీగానూ పనిచేశారు. 1996లో ఓటమి అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ కాంగ్రెస్ బలోపేతానికి పట్టుదల చూపుతున్నారు.
పొంగులేటి చేరికలోనూ..
రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే ప్రస్తుత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి. ఈయన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, సినీ స్టార్ వెంకటేశ్ కు వియ్యంకులు. కాగా, ఏడాది కిందట బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి బీజేపీ వైపు వెళ్లాలా? కాంగ్రెస్ లో చేరాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి సమయంలో సురేందర్ రెడ్డి పెద్దరికంతో పొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈ సంప్రదింపుల సందర్భంగా నాడు రేవంత్ రెడ్డి సైతం సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానంతో సన్నిహిత సంబంధాలున్న సురేందర్ రెడ్డి పెద్ద భూస్వామి. పాలేరుతోనూ ఈయనకు అనుబంధం ఉంది.
రోడ్ షో పుట్టింది సురేందర్ రెడ్డి ఆలోచనలోంచే
ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల పెద్ద నేతలు చేస్తున్న రోడ్ షో రాజీవ్ గాంధీ నోట వచ్చిన మాట. రాజీవ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా బహిరంగ సభకు సమయం సరిపోక సురేందర్ రెడ్డి రోడ్ షో (ర్యాలీగా వెళ్లడం) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇదే బాగా పాపులర్ అయింది. కాగా, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల చేరికలో మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలది కూడా ప్రధాన పాత్రగా ఉంటోంది.