కేసీఆర్‌ కు సీతక్క నోటీసులు!

మరోవైపు కేసీఆర్‌ గారాలపట్టి కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసింది.

Update: 2024-07-05 17:14 GMT

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితి అస్సలు బాలేదు. ఓవైపు గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ చేతిలో కేసీఆర్‌ పార్టీ చిత్తయింది. స్వయంగా కామారెడ్డిలో ఎమ్మెల్యేగా కూడా కేసీఆర్‌ గెలవలేకపోయారు.

మరోవైపు కేసీఆర్‌ గారాలపట్టి కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసింది. ఆమె మార్చి నెల నుంచి ఢిల్లీలోనే జైలులో ఉన్నారు. బెయిల్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా కోర్టు తిరస్కరిస్తూ వస్తోంది.

ఇంకోవైపు ఇప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.

ఇవి చాలవన్నట్టు కేసీఆర్‌ పదేళ్ల పాలనలోని అవినీతి, అక్రమాలపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వరుసగా విచారణ కమిషన్లను వేస్తోంది. ఆయనకు నోటీసులు కూడా జారీ అవుతున్నాయి.

తాజాగా మంత్రి సీతక్క.. కేసీఆర్‌ కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి లీగల్‌ నోటీసులు జారీ చేశారు. తనపై బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు సీతక్క ఈ నోటీసులు జారీ చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇసుకాసురుల రాజ్యం’ అంటూ బీఆర్‌ఎస్‌ పెట్టిన వీడియో తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని సీతక్క ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రూ. వంద కోట్లకు మంత్రి సీతక్క పరువునష్టం వేశారు. తనకు బేషరతుగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో కోరారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని.. ఇది పద్ధతి కాదని పేర్కొన్నారు.

కాగా మంత్రి సీతక్కపై జూన్‌ 24వ తేదీన బీఆర్‌ఎస్‌ అధికారిక సోషల్‌ మీడియా పేజీలో పోస్టులు పెట్టారు. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులో భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఆ మాఫియా వెనుక ఆమె ఉన్నారని ఆ పోస్టులో బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.

ములుగు జిల్లాలో లెక్కబెట్టలేని ఇసుక లారీలు అక్రమ దందా చేస్తున్నాయని ఈ అక్రమ దందా వెనుక సీతక్క ఉందంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేసింది. వెంకటాపురం మండలం అలుబాక గ్రామం దగ్గర పట్టపగలే లారీల్లో ఇసుక తరలింపు జరుగుతుందని తీవ్ర విమర్శలు చేసింది.

దీంతో తనపై చేసిన ఆరోపణలకు గాను తక్షణమే క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్‌ చేశారు. సీతక్క జారీ చేసిన లీగల్‌ నోటీసులపై కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే. సీతక్క కోరినట్టు లిఖితపూర్వకంగా బహిరంగ క్షమాపణ చెబుతారా, లేదో తేలాల్సి ఉంది.

Tags:    

Similar News