చంద్రబాబు – రేవంత్ భేటీలో కీలక పీటముడులు ఇవే!

ఈ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో అత్యంత కీలకంగా ఉన్న అంశాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం...!

Update: 2024-07-03 08:00 GMT

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు దాటినా ఇప్పటికీ ఉమ్మడి సమస్యలు పరిష్కారం కాని సంగతి తెలిసిందే. గతంలో కేసీఆర్ - చంద్రబాబు కలిసి భేటీ అయినా.. అనంతరం జగన్ – కేసీఆర్ కలిసి మాట్లాడుకున్నా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జూలై 6వ తేదీనా చంద్రబాబు - రేవంత్ రెడ్డి ముఖాముఖీ భేటీలో విభజన సమస్యలపై పరిష్కరించనున్నారు. ఈ సమయంలో పలు పీటముడులుపై చర్చ జరుగుతుంది.

అవును... రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల ఆరో తేదీన సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఆరోజు మధ్యాహ్నం ప్రజాభవన్ లో చంద్రబాబు – రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. వీరిద్దరికీ చాలా సాన్నిహిత్యం ఉందని చెబుతుండటం వల్ల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతుండగా... అంత ఈజీ కాదని మరికొంతమంంది సందేహపడుతున్నారు.

ఈ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో అత్యంత కీలకంగా ఉన్న అంశాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం...!

షెడ్యూల్ 9, 10 పీట ముడి!:

వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటినా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేని సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి కీలక సమస్యలూ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇదే క్రమంలో... విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజనతో పాటు పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తొమ్మిదో షెడ్యూల్ లో సుమారు 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు జాబితా చేశారు. ఇదే సమయంలో 10వ షెడ్యూల్ లో ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్, ఏపీ ఫారెస్ట్ అకాడమి, సెంటర్ ఫర్ ఫుడ్ గవర్నెన్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఏపీ పోలీస్ అకాడమీ వంటి సుమారు 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి.

ఇదే సమయంలో... విద్యుత్ బిల్లుల విషయంలోనూ చర్చలు కొలిక్కి రాలేని పరిస్థితి. ఇదే సమయంలో రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపైనా చర్చలు ముందుకు సాగలేదు. కారణం... ఉమ్మడి రాజధానిలోని ఆర్టీసీ ఆస్తుల్లో ఏపీకి వాటా ఇవ్వాలని కోరుతుండగా.. అందుకు టీఎస్ ఆర్టీసీ ససేమిరా అంటుంది. హైదరాబాద్ సిటీలోని అర్టీసీ ఆస్తులన్నీ తెలంగాణవే అని.. అలాటప్పుడు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తోంది.

ఏడు మండలాల వ్యవహారం!:

ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు అత్యంత సున్నితమైన అంశం అని అంటున్నారు. ఈ ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపే విషయంలో ఇప్పటికే బీఆరెస్స్ నుంచి రేవంత్ కు సూచనలు వచ్చేసిన పరిస్థితి. గతంలో ఈ ఏడు మండలాలూ ఏపీకి బదలాయిస్తూ పొందుపరిచిన బిల్లును కాంగ్రెస్, రేవంత్ లు సమార్థించారని బీఆరెస్స్ నేతలు అంటున్నారు.

ఇప్పుడు ఆ ఏడు మండలాలనూ, దిగువ సీలేరు ప్రాజెక్టునూ తెలంగాణకు తిరిగి ఇచ్చేలా చూడాలని రేవంత్ ను బీఅరెస్స్ నేతలు కోరుతున్నారు. చంద్రబాబు చెబితే మోడీ వింటారని ధీమాగా చెబుతూ బంతి ఆ కోర్టులో వేసేస్తున్నారు!

సక్సెస్ కాని గవర్నర్ నేతృత్వంలోని సమావేశం!:

2014లో తెలంగాణలో బీఆరెస్స్, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆస్తుల పంపకాలకు సంబంధించి నాటి గవర్నర్ నరసింహన్ నేతృత్వంలో రాజ్ భవన్ వేదికగా కొన్ని సమావేశాలు జరిగాయి. అయితే... గవర్నర్ నరసింహన్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ సర్కార్ సైడ్ అయ్యింది!

అనంతరం జరిగిన పలు కీలక పరిణామాల నేపథ్యంలో హుటాహుటిన ఏపీ ప్రభుత్వం పాలన అమరావతికి మార్చుకోవడంతో... సెక్రటేరియట్ లో ఏపీకి కేటాయించిన భవనాలు తమకు ఇవ్వలని కేసీఆర్ ఒత్తిడి చేశారు! అయితే అందుకు చంద్రబాబు ససేమిరా అన్నారు. దీంతో... నాటి నుంచి సమస్యలపై చర్చలు అదిలొనే హంసపాదు అన్నట్లుగా అగిపోయాయి.

జగన్ – కేసీఆర్ బంధం కలిసి రాలేదు!:

ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ సమక్షంలో జరిగిన చర్చలూ ఫెయిల్ అయిన అనంతరం... ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే కంటిన్యూ అయ్యింది. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ హాజరవ్వడంతో... వీరిద్దరి పాలనలో విభజన సమస్యలు పరిష్కరించబడతాయనే కామెంట్లు వినిపించాయి.

అయితే... రాజకీయంగా కేసీఆర్ – జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. వీరిద్దరూ ఒకటి రెండు సార్లు సమావేశమైనా.. అవి రాజకీయ కోణంలోనే జరిగాయి తప్ప.. ఆ సమయంలో వారి మధ్య విభజన సమస్యల పరిష్కారంపై చర్చ జరగలేదని అంటారు.

చంద్రబాబు – రేవంత్ రెడ్డి భేటీపై ఆశలు!:

గతంలో చంద్రబాబు - కేసీఆర్, తర్వాత జగన్ – కేసీఆర్ ల భేటీలు సక్సెస్ కాని నేపథ్యంలో... మూడోసారి భేటీ కాబోతున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి - చంద్రబాబుల నేతృత్వంలో అయినా ఈ సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అని ఇరు రాష్ట్రాల ప్రజానికం ఎదురుచూస్తున్నారని అంటున్నారు.

ఇప్పటివరకూ పరిష్కారం అయ్యింది అదొక్కటే!:

విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకూ చెందిన సమస్యల్లో ఢిల్లీ లోని ఏపీ భవన్ సమస్య ఒక్కటే పరిష్కారం కావడం గమనార్హం. ఇందులో భాగంగా... ఈ ఏడాది మార్చిలో రెండు రాష్ట్రాలకు కేంద్రం భూకేటాయింపులు చేయడంతో ఢిల్లీలోని ఏపీ భవన్ పై వివాదం సద్దుమణిగింది. విభజన చట్టం ఆధారంగా 58:42 ప్రకారం రెండు రాష్ట్రాలు ఈ భవన్ ఆస్తులు పంచుకున్నాయి.

Tags:    

Similar News