వలంటీర్లకు ఓకే.. చంద్రబాబు పెద్ద మార్పు.. !
ఎన్నికలకుముందు..వలంటీర్లను తీసేయబోమని.. వారికి వేతనాలను రూ.5 వేలు కాదు.. రూ.10వేలకు పెంచి ఇస్తామని చంద్ర బాబు ప్రకటించారు.
అంతా సైలెంట్‌గా జరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు వలంటీర్లను పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం.. ప్రకటనలు లేకుండానే వలంటీర్లను విధుల్లోకి తీసేసుకుంది. ఎన్నికలకు ముందు.. వలంటీర్ల వ్యవస్థ తీవ్ర రాజకీ యాల చుట్టూ తిరిగింది. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని.. వారంతా కార్యకర్తలేనని.. పేర్కొంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అనంతరం.. వారిని ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరం పెట్టింది. తర్వాత.. కూటమి సర్కారు వచ్చిం ది. దీంతో వారికి అవకాశం ఇస్తారని.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం ఇస్తారని భావించారు.
ఎన్నికలకుముందు..వలంటీర్లను తీసేయబోమని.. వారికి వేతనాలను రూ.5 వేలు కాదు.. రూ.10వేలకు పెంచి ఇస్తామని చంద్ర బాబు ప్రకటించారు. దీని ప్రకారం.. తమకు న్యాయం చేయాలని.. కొన్నాళ్లుగా వలంటీర్లు కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం వారి విషయాన్ని పక్కన పెడుతూ వచ్చింది. ఇంతలోనే ప్రతి నెలా 1న పింఛన్ల పంపిణీకి కూడా.. వారిని వినియోగించ లేదు. వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందితోనే వాటిని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు వలంటీర్ల సేవలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీనికి కారణం.. వరదలు, విపత్తుల కారణంగా.. ప్రజల వివరాలు తెలుసుకునేందుకు సరైన యంత్రాగం లేకపోవడమే. అంతేకాదు.. స్థానికంగా ప్రజల వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారు వలంటీర్లే. అధికారులు ఆయా వివరాలు తెలుసుకోవాలం టే.. వారం రోజుల సమయం పడుతుంది. అందుకే వ్యూహాత్మకంగా చంద్రబాబు వలంటీర్లను తీసేసుకున్నారు. కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం నుంచి వలంటీర్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీరిలో సగం మందిని ఆహార పోట్లాల పంపిణీకి, తయారీకి వినియోగించుకుంటున్నారు.
మరికొందరిని ఎన్యూమరేషన్ లెక్కల కోసం వినియోగించాలని నిర్ణయించారు. దీంతో బుధవారమే కలెక్టర్లు ఈ మేరకు వలంటీర్లను పిలిచి.. వారికి సేవలు అందించారు. అయితే.. ఇక్కడో కొత్త వివాదం తెరమీదికి వచ్చింది. వలంటీర్లలో ఎన్నికలకు ముందు రాజీనామాలు చేయని వారిని మాత్రమే ప్రస్తుతం విధుల్లోకి తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన వారిని.. రాజీనామాలు చేసిన వారిని మాత్రం పక్కన పెడుతున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగుతున్నారు. కాగా.. ప్రస్తుతం విధుల్లోకి తీసుకున్న వలంటీర్లకు సంబంధించి ఎక్కడా ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం గమనార్హం.