తమ్ముళ్ళ ముఖాల్లో దీపావళి వెలుగులు నింపాలని బాబు తపన !
మొత్తం మీద చూస్తే ఈసారి దీపావళి నిజంగా తమ్ముళ్ళకు కూటమిలోని జనసేన బీజేపీ నేతలకు దక్కుతుందని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికల్లో లభించిన విజయం చారిత్రాత్మకం. అలాగే 2019 లో ఘోర ఓటమి తరువాత అయిదేళ్ల ప్రతిపక్షం ఒక పెద్ద చేదు అనుభవం. వైసీపీ ప్రభుత్వం అయితే టీడీపీని ముప్ప తిప్పలు పెట్టింది. దాంతో అధికారం పోతే పొందే బాధ ఏంటో తెలిసింది.
రాజకీయాలు గతంలోలా లేవు అని అర్ధం అయింది. అంతే కాదు ప్రతీకార రాజకీయాలకు వైసీపీ తెర తీసి టీడీపీ క్యాడర్ ని లీడర్ ని చెల్లాచెదురు చేసి ఒక దశలో పార్టీ ఉనికికే ముప్పు తెచ్చేలా దూకుడు చేసింది. ఇంత చేసినా బాబు అపర చాణక్యం దానితో పాటు తమ్ముళ్ల వీర విధేయత. పొత్తులు ఎత్తులు వ్యూహాలు అన్నీ కలసి టీడీపీ నాయకత్వం లో కూటమి ఘన విజయం సాధించింది.
దాంతో ఈ విజయం అపూర్వంగా ఉంది. దీనికి కారకులు అయిన క్యాడర్ ని పార్టీలోని ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాన్ని సమాదరించి అక్కున చేర్చుకోవాలని అధినేతగా చంద్రబాబు తపన పడుతున్నారు. గతంలో అయితే నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో బాబు అన్నీ చూసుకుంటూ వీలైనంతగా సుదీర్ఘమైన కసరత్తు చేస్తూ లేట్ చేసేవారు.
ఈసారి మాత్రం అలా కాకూడదని తమతో పాటుగా పార్టీలోని ఇతర నాయకత్వం కూడా అధికార ఫలాలు అనుభవించాలని భావించే మొత్తం 20 దాకా నామినేటెడ్ పదవులను తొలి విడతలో పంపిణీ చేశారు అందులో టీడీపీకి 16 జనసేనకు 3 బీజేపీకి ఒకటి పదవి దక్కింది.
ఇపుడు రెండవ విడతలో ఏకంగా 40 దాకా కార్పోరేషన్ల పదవులు భర్తీ చేయడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. సెకండ్ లిస్ట్ అయితే పూర్తిగా ఖరారు అయిందని కూటమి మిత్రులు జనసేన బీజేపీలకు సముచిత స్థానం ఇచ్చేలా వారి నుంచి కూడా సమ్మతిని తీసుకున్నరని అంటున్నారు. దాంతో దీపావళికి ముందే పదవుల పందేరం ప్రకటన ఉంటుందని అంటున్నారు. అంటే తమ్ముళ్ల ముఖాలలో దీపావళి కాంతులు చూడాలని బాబు తపనకు అద్దం పట్టేలా ఈ పదవుల భర్తీ ఉంటుందని చెబుతున్నారు.
ఈ భర్తీ ద్వారా బాబు అసలు సిసలు నాయకులకు పార్టీ కోసం సర్వం ధారబోసిన వారికి పదవులతో సత్కరించబోతున్నారు అని అంటున్నారు. అలాగే కూటమికి భారీ విజయం అందించిన గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాలకు ఈ దఫా పందేరంలో సింహ భాగం పదవులు అందుతాయని చెబుతున్నారు
మొత్తం మీద చూస్తే ఈసారి దీపావళి నిజంగా తమ్ముళ్ళకు కూటమిలోని జనసేన బీజేపీ నేతలకు దక్కుతుందని అంటున్నారు. ఈసారి అచ్చమైన దీపావళి అని వారంతా పాడుకునేలా పదవుల భర్తీకి సంబంధించి ప్రకటన వస్తుందని అంటున్నారు. చూడాలి మరి.