ఇక్కడ పవన్ ...అక్కడ చంద్రబాబు!

అయితే ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎవరు గెలిచారనేది ఆసక్తి రేపుతోంది.

Update: 2025-02-08 15:30 GMT

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ గద్దెను ఎక్కుతున్న బీజేపీ.. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీజేపీ అగ్రనేతలతోపాటు ఎన్డీఏ కూటమి పార్టీలను ప్రచార రంగంలోకి దింపింది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రచారం చేయడం ఈ ఎన్నికల్లో హైలెట్ గా చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు తన 4.0 ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలిసారి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోనూ ఆయనతో ప్రచారం చేయాల్సివుండగా, ఆఖరి నిమిషంలో రద్దైంది. అయితే ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎవరు గెలిచారనేది ఆసక్తి రేపుతోంది.

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోనే ఇతర రాష్ట్రాల్లోనూ మన తెలుగు నేతలు బాగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో కూటమి బంపర్ విక్టరీ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. సినిమా నటుడిగా పవన్ కు ఇది వరకు గ్లామర్ ఉండగా, ఇప్పుడు రాజకీయ అనుభవం పనికొస్తుంది. దీంతో దేశంలో ప్రముఖ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆయనతోపాటు చంద్రబాబుతోనూ బీజేపీ ప్రచారం చేయిస్తోంది. ఇలా ఏపీలో గెలిచిన తర్వాత తొలిసారి మహారాష్ట్రలో ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ బీజేపీకి విక్టరీ తెచ్చిపెట్టారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ బంపర్ మెజార్టీతో గెలిచిందని చెబుతారు. ఇక ఇప్పుడు ఢిల్లీలో పవన్ ప్రచారం చేయకపోయినా, సీఎం చంద్రబాబు వెళ్లారు. ఎన్డీఏ భాగస్వామి బీజేపీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో చంద్రబాబుతో వ్యూహాత్మకంగా ప్రచారం చేయించింది బీజేపీ.

ఢిల్లీలో ప్రచారం చేసిన చంద్రబాబు.. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఓడించాల్సిందిగా పిలుపునిచ్చారు. షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉంటారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మూడు నియోజకవర్గాల్లో ప్రచార గడువు ముగియడానికి ఒక రోజు ముందు పర్యటించారు. తన ప్రచారంలో దేశ రాజధాని వెనుకబాటు తనంపై చంద్రబాబు ఫోకస్ చేశారు. న్యూయార్క్ నగరంతో పోటీపడాల్సిన ఢిల్లీ.. పాడుపడిపోయినట్లు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నెండేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో పెద్దగా మార్పు రాకపోవడాన్ని ముఖ్యమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. తరచూ అభివృద్ధి కార్యక్రమాలపై తన విజన్ ఆవిష్కరించే చంద్రబాబు.. ప్రధాని మోదీ విజన్ ను ఢిల్లీలో ఎక్కువగా ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు చెప్పిన విషయాలను ఢిల్లీ ఓటర్లు నమ్మారా? లేదా? అనే ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అయితే ఎన్నికల ఫలితాల వచ్చిన తర్వాత చూస్తే చంద్రబాబు మాటలను ఢిల్లీ వాసులు విశ్వసించారని అంటున్నారు. ఆయన ప్రచారం చేసిన మూడు చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో చంద్రబాబు ప్రచారం వర్క్ అవుట్ అయిందంటున్నారు.


Tags:    

Similar News