'తక్షణ' నేతలు తగ్గుతున్నారే.. బాబు ఆరా..!
నిజానికి పొలిట్ బ్యూరో సమావేశం జరిగి..చాలా రోజులు అయింది. కానీ, ఈ విషయం ఇప్పుడే బయటకు రావడం విశేషం.
పార్టీ పేరును, ఊరును కాపాడుతూ.. ప్రభుత్వం తరఫున బలమైన గళం వినిపించే నాయకులు టీడీపీలో తగ్గుతున్నారా? ప్రభుత్వం తరఫున మీడియా ముందుకు వచ్చి.. తమదైన వాయిస్ వినిపించే వారు గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు వెనుకబడ్డారా? అంటే.. ఔననే అంటున్నారు చంద్రబాబు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో పేర్కొన్నట్టు తాజాగా వెలుగు చూసింది. నిజానికి పొలిట్ బ్యూరో సమావేశం జరిగి..చాలా రోజులు అయింది. కానీ, ఈ విషయం ఇప్పుడే బయటకు రావడం విశేషం.
పార్టీ అధికారంలో ఉన్న 2014-19 మధ్య, విపక్షంలో ఉన్న 2019-24 మధ్య కొందరు నాయకులు తక్షణం స్పందించేవారు. వైసీపీ సర్కారుపై విమర్శలు చేసేందుకు, టీడీపీ సర్కారు చేస్తున్న పనులను ప్రజలకు వివరించేందుకు వారు ఎంతో కృషి చేశారు. పార్టీ వాయిస్‌ను బలంగా కూడా వినిపించారు. దీంతో టీడీపీకి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ, ఇప్పుడు పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక.. ఈ తక్షణ నేతలు తగ్గిపోయారన్న వాదన వినిపిస్తోంది. దీనిపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు.
``అందరికీ అన్నీ చేశాం. అయినా.. తక్షణం స్పందించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు. తిరుపతి తొక్కిసలాటపై మన మీద వ్యతిరేక ప్రచారం జరిగింది. సూపర్ సిక్స్ అమలుపైనా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారం చేశారు. వీటిని తిప్పికొట్టేందుకు.. నేనే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అయితే.. కష్టం`` అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు.
తక్షణం స్పందించేవారు లేరా? లేకపోతే.. తయారు చేయాలన్న సూచనలు కూడా పార్టీ అధినేత నుంచి వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ తరఫున సోషల్ మీడియా మాత్రమే తక్షణం స్పందిస్తోంది. ఇక, ప్రధాన మీడియా ఉన్నప్పటికీ.. నాయకుల కొరత మాత్రం వెంటాడుతోందన్నది చంద్రబాబు ఆవేదన. నాయకులు బలమైన వాయిస్ వినిపిస్తే.. వైసీపీకి అవకాశం తగ్గుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారట.
ఈ నేపథ్యంలో కొందరు సీనియర్లను తక్షణం స్పందించే దిశగా కార్యాచరణ రూపొందించనున్నట్టు సీనియర్ నేత వెల్లడించారు. ``గతంలో చాలా మంది స్పందించేవారు. కారణాలు ఏవైనా ఇప్పుడు వారంతా మౌనంగా ఉన్నారు. ఇది సరికాదని చంద్రబాబు చెబుతున్నారు.`` అని ఆయన వెల్లడించారు.