అక్రమార్కులను ముంచనున్న బుడమేరు...హైడ్రా తరహా చట్టానికి బాబు కసరత్తు !

బుడమేరు వరదలు బెజవాడను ముంచేసిన ఘటన కూటమి పెద్దలలో సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయిస్తోంది.

Update: 2024-09-10 04:23 GMT

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది. పటిష్టమైన చట్టం వస్తేనే తప్ప ఆక్రమణలకు జవాబు చెప్పలేమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బుడమేరు వరదలు బెజవాడను ముంచేసిన ఘటన కూటమి పెద్దలలో సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయిస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలను సహించేది లేదు ని బాబు అంటున్నారు. కొందరి ప్రయోజనం కోసం లక్షలాది మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అని అంటున్నారు. బుడమేరు వరదల వల్ల ఏకంగా రెండున్నర లక్షల మంది ప్రజలు ఆస్తులతో పాటు సర్వస్వం కోల్పోయారు. వారి బాధ వర్ణనాతీతం అయింది.

ఇది ఏ ప్రభుత్వం ఆర్చలేనిది, తీర్చలేనిది. మళ్లీ వారంతా సాధారణ పరిస్థితులకు వచ్చేందుకు ఎంతో సమయం పడుతుంది. ఇదిలా ఉంటే హైడ్రా తరహా చట్టాన్ని ఏపీలో కూడా తెస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విశేషం.

నిజానికి చూస్తే బుడమేరు వరదలు బెజవాడ మునకలు లేని నేపథ్యంలో గతంలో టీడీపీ కూటమిలో హైడ్రా మీద చర్చ అయితే లేదు. తెలంగాణాలోనే అది ఉంది. ఏపీలో గట్టి చట్టాలే ఉన్నాయని కూడా కూటమి నేతలు అంటూ వచ్చారు. కానీ ఒక్కసారిగా బుడమేరు పొంగి విజయవాడ కొంప ముంచడంతో టీడీపీ కూటమి ఇమేజ్ కూడా బాగా ఇబ్బందులో పడింది అన్న చర్చ నడుస్తోంది.

లక్షలాది మందిని పునరావాసాలకు తరలించడం అన్నది అసాధ్యం. అదే సమయంలో వరదలను కూడా ఆపడం అంతే అసాధ్యం. మరి ప్రజలలో పెల్లుబికిన ఆగ్రహాన్ని చల్లార్చాలంటే కఠిమైన చర్యల దిశగా అడుగులు వేయాల్సిందే అన్నది కూటమి పెద్దల ఆలోచనగా ఉంది. ఎపుడైతే బెజవాడను వరదలు ముంచెత్తాయో అప్పటి నుంచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రా ప్రస్తావన తెస్తూనే ఉన్నారు.

ఇపుడు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సీఎం కూడా గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని పూర్తిగా అధ్యయనం చేసిన మీదట హైడ్రా వంటి బలమైన వ్యవస్థ ఉండాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చారు అని అంటున్నారు. దాంతోనే ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు.

హైడ్రా తరహా చట్టానికి పదును పెడుతున్నామని వచ్చే మంత్రి వర్గ సమావేశంలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు అంటే ఏపీలో బుడమేరు చేసిన వర్ద బీభత్సం తోనే ఇదంతా అన్న చర్చ నడుస్తోంది. ఇంకో వైపు చూస్తే బుడమేరు లో ఆక్రమణలను మొత్తం తొలగిస్తామని కూడా బాబు ప్రకటించారు. ఉన్నట్టుండి బుడమేరు పొంగడానికి ఆక్రమణలే కారణం అని కూడా ఆయన అన్నారు.

అదే విధంగా చూస్తే పటిష్టమైన చట్టాలలో భూ కబ్జా దారులకు ఆక్రమణదారులకు తగిన బుద్ధి చెబుతామని కూడా అంటున్నారు. మరీ ముఖ్యంగా కొల్లేరులో దురాక్రమణలు వల్లనే వరద నీరు వెనక్కి తన్నిందని బాబు అన్నారు. దాంతో ఎంతటి వారు అయినా సరే చట్టం కోరలలో బిగించి ఆక్రమణలను మొత్తం తొలగిస్తామని కూడా ప్రకటించారు.

విజయవాడకు మరోసారి వరదలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలో అదే చేస్తామని బాబు అనడం బట్టి చూస్తే హైడ్రా తరహా చట్టం మీద ప్రభుత్వం పట్టుదల అర్ధం అవుతోంది. ఇదిలా ఉంటే మరోసారి బెజవాడ మునగడాన్ని అటు ప్రభుత్వమూ తట్టుకోలేదు, ఇటు ప్రజలూ అంతకంటే తట్టుకోలేరు అన్న్న మాట కూడా ఉంది. బెజవాడలో తొలిసారి జరిగిన తప్పు కాబట్టి కూటమి దానిని పూర్తిగా సవరించేందుకు సిద్ధంగా ఉంది.

టీడీపీకి కంచుకోట లాంటిది బెజవాడ. అలాంటి హార్డ్ కోర్ జోన్ ని వదులుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. పైగా ఇదంతా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం. అందుకే ఏ కొద్ది మంది కోసమో అన్న మాట కూడా ప్రభుత్వం వాడుతోంది. హైడ్రా తరహా చట్టం అంటే ఏపీలో అక్రమార్కుల గుండెలలో సైతం రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుకంటే నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు. దాంతో ఈ చట్టం ఎవరి కొంప ముంచుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News