'సూపర్ 6కు' ఐవీఆర్ఎస్.. బాబు ప్లాన్ వెనుక రీజనేంటి ..!
ఎన్నికలకు టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల విషయంలో సర్కా రు కొత్త బాట పట్టింది.
ఎన్నికలకు టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల విషయంలో సర్కా రు కొత్త బాట పట్టింది. సూపర్ సిక్స్‌లో కీలకమైన మాతృ వందనం, ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ బస్సులో మహిళ లకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ వంటి కీలక హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు. వీటిపై పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం ఆరు పథకాలు ప్రకటిస్తే.. వీటిలో కేవలం `దీపం-2` పథకాన్ని మాత్రమే ప్రస్తుతం అమలు చేస్తున్నారు.
ఇక, సాధారణ హామీల్లో అన్న క్యాంటీన్లు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఏర్పడిన రెండు మాసాలకే ఇస్తు న్నారు. ఇక, నాలుగో నెల నుంచి దీపం-2 కింద .. గ్యాస్ రాయితీలు ఇస్తున్నారు. అయినా.. ప్రజల్లో సంతృ ప్తి కనిపించడం లేదు. నాయకులు, మంత్రులు ప్రజా క్షేత్రంలోకి వెళ్లినప్పుడు.. జగన్ ఉన్నప్పుడు.. తమ చేతిలో సొమ్ములు ఉండేవని.. ఇప్పుడు డబ్బులకు ఇబ్బందులు పడుతున్నామని వారు నేరుగా చెప్పేస్తున్నారు. ఈ వ్యవహారం చంద్రబాబుకు కూడా తెలిసింది.
ఇటీవల అనంతపురంలో బాబు పర్యటించి.. పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు.. నిర్వహించిన సభలో పలువురు మహిళలు ఆయనను కలిసి ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ బస్సు, అమ్మ ఒడి(మాతృవందనం) గురించి ఆరా తీశారు. దీనికి చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అప్పటికి ఆ సమస్య తీరినా.. తిరిగి సచివాలయానికి చేరుకున్నాక.. వాటిపై చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. దీనిలో నిజంగానే ప్రజల్లో డిమాండ్ ఉందని.. పథకాల కోసం వేచి చూస్తున్నారని తెలిసింది.
ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ 6పై ఐవీఆర్ ఎస్ సర్వే చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిలో పథకాలపై ప్రజలేమనుకుంటున్నారనే విషయం కాదు.. అసలు పథకాలు ఇప్పటికిప్పుడు అమలు చేయాలా? వద్దా? అనే విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ విషయంపై ప్రజల నుంచి సమాచారం సేకరిస్తారు. ఈ నెల 10 నుంచి ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి సమాచారం తీసుకుని.. ఆ తర్వాత అమలు చేయాలన్నది బాబు ప్లాన్.
అంటే.. మెజారిటీ ప్రజలు ఇప్పుడు తమకు అవసరం లేదు. ముందు రాష్ట్రం బాగుపడాలని కోరితే.. ఆ ప్రకారం.. పథకాలను వచ్చే ఏడాది నుంచి అమలు చేసే దిశగా సర్కారు ఆలోచన చేయనుంది. మరి ప్రజల ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో చూడాలి.