బాబు జగన్ లలో ఒక్కరే ఉంటారా ?

అధికారంలోకి ఎవరైనా ఎక్కాలే కానీ అపొజిషన్ ని లేకుండా చేయాలని చూస్తారు.

Update: 2024-06-02 19:12 GMT

దేశంలో ఎన్నికలు వేరు ఏపీలో ఎన్నికలు వేరు. అక్కడ రాజకీయంగా ప్రత్యర్ధులు పోటీ పడతారు. ఏపీలో ఆ పరిస్థితి ఏనాడో మారిపోయింది. ఇక్కడ శత్రువులుగానే పోరాడుతున్నారు. అధికారంలోకి ఎవరైనా ఎక్కాలే కానీ అపొజిషన్ ని లేకుండా చేయాలని చూస్తారు. వారి అజెండాలో అదే అగ్ర తాంబూలం అవుతుంది.

ఈ రకమైన విశ్లేషణలు ఇపుడు చాలా మంది వినిపిస్తున్నారు. నిజానికి చూస్తే ఇది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. రాజకీయాల్లో ఎందరో ఉంటారు. ఎన్నికల్లో అధికారం కోసం మరెందరో పోటీ పడతారు. ప్రజలు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరినీ తక్కువ చేయరు. ఒకరికి అధికారం ఇచ్చి రెండవ వారికి గురుతర బాధ్యతలు అప్పగిస్తారు.

వారిని ప్రతిపక్షంలో ఉంచుతారు. దాంతో వారు కూడా ప్రభుత్వంతో కలసి ప్రజల కోసం పాటు పడాలి. కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడులో ఇంత లాగే రాజకీయం వ్యక్తిగత స్థాయిలోకి దిగిపోయింది. అలా సాగిన భీకర పోరు చివరికి మహిళ అని చూడకుండా జయలలిత వలువలు నిండు శాసనసభలో ఊడ్చేలా చేసింది.

అలాగే వయోవృద్ధుడని చూడకుండా కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేసేలా చేసింది. అలా డీఎంకే అన్నాడీఎంకేల మధ్య దశాబ్దాల పాటు సాగిన అంతటి రాజకీయాల్లోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు పనిచేయడం అంతా చూసారు. ఎంత గొడవ ఉన్నా కేంద్రానికి ఎక్కడా ఆస్కారం ఇచ్చేవారు కాదు.

ఇపుడు చూస్తే తమిళనాడులో ఆ పరిస్థితి కూడా పూర్తిగా పోయింది. కానీ అదేమి దురదృష్టమో ఏపీలో మాత్రం అంతకంటే భయంకరమైన వాతావరణం ఏర్పడింది. తమిళనాడులో చూస్తే రెండు వైపులా ఉన్నది సిద్ధాంతపరమైన పోరు కాదు, రెండూ ద్రవిడ వాదాన్ని బలంగా విశ్వసించే పార్టీలే.

కులాల సంకుల సమరం అన్నది అక్కడ లేదు. కానీ ఏపీలో సిద్ధాంత రాహిత్యం ప్రాంతీయ పార్టీలలో నిండుగా మెండుగా ఉంది. పైగా సంకుల సమరానికి కూడా పార్టీలు రాజకీయాలను వేదికగా చేసుకోవడంతో అది దారి తప్పిందని అంటున్నారు.

అధినేతలు సైతం సహనం కోల్పోవడంతో ఇక క్యాడర్ దిగువ స్థాయి లీడర్ల విషయం చెప్పాల్సింది లేదు. ఇటీవల ఒక పార్టీకి సపోర్ట్ చేసిన టీవీలో స్కిట్స్ చేసుకునే ఒక చిన్న ఆర్టిస్టు ఒక యూ ట్యూబ్ ఇంటర్యూలో అంటున్న మాటలు చూస్తే అమ్మో అనిపించేలా ఉంది. సదరు ఆర్టిస్ట్ ఓడిన వారిని నేరుగా తీసుకుని వచ్చి జైలులో వేస్తారు అని ఇదే జరుగుతుందని బాహాటంగా జోస్యం చెప్పాడు. నిజంగా ఆయన ఏ పార్టీకి కార్యకర్త కాదు, జస్ట్ అభిమానిగా ఉంటూ ప్రచారం చేసి ఉండవచ్చు. కానీ అంతనిలోనే ఇంతటి ఫైర్ ఉంటే సగటు క్యాడర్ ని ఆపతరమా. అందువల్లనే ఏపీలో అంతా భయపడే పరిస్థితి ఉంది.

మరో వైపు చూస్తే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు అయితే ఏపీలో రాజకీయం ఎలా ఉండబోతుందో చెప్పారు. ఏపీలో జగన్ కానీ బాబు కానీ ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు అని ఆయన అంటున్నారు. ఇది బాధాకరం అయినా పీక్స్ కి రాజకీయాలు మారిపోయాయని అన్నారు.

దేశంలో ఎంతోమంది ఓడారు, ఓడిన వారు శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండరని మళ్ళీ గెలుస్తారని పైగా అధికార ప్రతిపక్షాల మధ్య కూడా మంచి సంబంధాలు ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ ఓడినా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారని రాజకీయంగానే వారు విమర్శించుంటున్నారని ఏపీలో అలాంటి వాతావరణం లేదని ఆయన అనడం విశేషం.

మొత్తానికి చూస్తే జూన్ 4న తరువాత గెలిచేది ఒక పార్టీనే. ఆ పార్టీ ఏదైనా రెండవ పార్టీని నిర్వీర్యం చేయకుండా వారిని కూడా ప్రజా స్వామ్యంలో ప్రజా తీర్పునకు అనుగుణంగా గౌరవించాల్సి ఉంది. అలాగే అంతా కలసి ఏపీ అభివృద్ధి కోసం పాటుపడాల్సి ఉంది. మరి అలాంటి మంచి వాతావరణం ఈ ఎన్నికలతో అయినా ఏపీలో వస్తుందని ఆశిద్దామని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. జూన్ 4 తరువాత ఏపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో.

Tags:    

Similar News