బెజవాడ కోర్టు వద్ద స్వీట్లు పంచిన టీడీపీ మాజీ నేత
ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేసి.. రిమాండ్ తరలించిన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి
ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేసి.. రిమాండ్ తరలించిన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావటంతో మాజీ టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వరరావు బెజవాడ కోర్టు వద్ద స్వీట్లు పంచిపెట్టారు. తనకు తాను టీడీపీ నేతగా చెప్పుకునే ఆయన తీరును పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
బెజవాడ కోర్టు వద్ద అరెస్టును పురస్కరించుకొని స్వీట్లు పంచిన వైనం.. టీడీపీ కార్యకర్తలు.. అభిమానుల్ని రెచ్చగొట్టేలా చేస్తుందన్న ఉద్దేశంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి ముందు.. అక్కడున్న మీడియాతో మాట్లాడిన ఆకుల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు నారా లోకేశ్ కుట్ర చేస్తున్నారని.. ఆయన దగ్గర ఉన్న పుస్తకంలో తన పేరును ఎర్ర ఇంకుతో రాసుకున్నట్లుగా ఆరోపించారు.
పార్టీ కోసం తాను ఆస్తులు పోగొట్టుకున్నానని.. ఒక సమయంలో చంద్రబాబుతో కలిసి కార్లలో తిరిగేవాడినని చెప్పుకున్నారు. జూబ్లీహిల్స్ లో 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కేఎల్ నారాయణ లాక్కున్నారన్న ఆకుల న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు చేసిన అన్యాయాల వల్ల తాను బలి అయ్యానని ఆరోపించిన ఆకుల వెంకటేశ్వర్లు.. తాను కేసుల్లో ఇరుక్కొని నెల రోజులు జైల్లో ఉన్నట్లుగా చెప్పారు. చంద్రబాబును నమ్మి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని.. ఈ రోజున తన కుటుంబం రోడ్డు మీద ఉందన్నారు. తనకు న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోలేదన్న ఆయన.. చంద్రబాబు తనను వాడుకొని వదిలేశారన్నారు.